రూరల్​ ఓటు ఎటు వైపు?..అర్బన్​తో పోలిస్తే పల్లెల్లో పెరిగిన పోలింగ్​ శాతం

రూరల్​ ఓటు ఎటు వైపు?..అర్బన్​తో పోలిస్తే పల్లెల్లో పెరిగిన పోలింగ్​ శాతం
  • ఎవరికి కలిసివస్తుందోనని లెక్కలు వేసుకుంటున్న పార్టీలు, అభ్యర్థులు
  • అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​కు పట్టం కట్టిన రూరల్​ ఓటర్లు 
  • ఈసారి అదే రిపీట్​ అవుతుందని హస్తం పార్టీ ధీమా
  • తమకే పడి ఉంటాయని బీజేపీ, బీఆర్ఎస్ ఆశలు​

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రంలో సోమవారం జరిగిన లోక్​సభ ఎన్నికల్లో మరోసారి పల్లె ఓటెత్తింది. ఎప్పటిలెక్కనే పట్టణ ఓటర్లు నిరాశపర్చారు. గెలుపోటములను డిసైడ్​ చేసేది రూరల్​ ఓటు బ్యాంకే కావడంతో గ్రామాల్లో నమోదైన ఓట్లు ఎటువైపు మళ్లాయనే దానిపై పొలిటికల్​ లీడర్లు, క్యాండిడేట్లు లెక్కలు వేసుకుంటున్నారు. ఓటర్లు ఎవరి వైపు మొగ్గుచూపారనే దానిపై ఓ అంచనాకు వస్తున్నారు.

రూరల్​లో నమోదైన పోలింగ్ ఎవరికి లాభం చేకూరుస్తుందని..  ఏయే పోలింగ్ సెంటర్​లో ఎంత  ఓటింగ్ శాతం నమోదైందన్న వివరాలు తెప్పించుకొని విశ్లేషించుకుంటున్నారు. గెలుపు తమదంటే తమదేనని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్​ఎస్​ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 

సాధారణంగా జనరల్ ఎలక్షన్స్ లో ఓటింగ్ శాతం పెరిగితే అది అధికార పార్టీకి వ్యతిరేకమని పలు ఎన్నికల్లో స్పష్టమైంది. ఇవి పార్లమెంట్​ ఎన్నికలు కావడంతోపాటు అందులోనూ ఓటింగ్​ శాతం 2019 ఎన్నికల నాటి ఓటింగ్​శాతానికి చేరువైంది. అర్బన్​తో చూస్తే రూరల్​ ఏరియాల్లో ఎక్కువ పోలింగ్ శాతం నమోదు కావడంతో.. అది ఎవరికి కలిసి వస్తుందని లీడర్లు లెక్కలు తీస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పల్లె ఓటర్లు బీఆర్​ఎస్​ను కాదని, కాంగ్రెస్​కు పట్టం కట్టినట్లు..

లోక్​సభ ఎన్నికల్లోనూ మళ్లీ అదే సీన్​ రిపీట్​ అవుతుందని, తమవైపే పల్లె జనం ఉన్నారని కాంగ్రెస్​ నేతలు నమ్ముతున్నారు. బీఆర్​ఎస్​ పార్టీకి గ్రామాల్లోని ఓటింగ్​పై టెన్షన్​ పట్టుకున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్​ ఓటర్లు తమను దెబ్బ కొట్టారని, ఇప్పుడూ అదే పరిస్థితి రిపీట్​ అవుతుందేమోనని గులాబీ నేతలు కలవరపడుతున్నారు. ఇక,  అర్బన్​ ఏరియాల్లో  ఎక్కువగా ప్రభావం చూపే బీజేపీ..

రూరల్​ పోలింగ్​ శాతాన్ని చూసి కాస్త ఆందోళన చెందుతున్నది. ముఖ్యంగా అభ్యర్థుల తలరాతలు మార్చే అవకాశాలున్న మైనార్టీలతోపాటు మహిళా ఓటర్లు, రైతులు ఏ పార్టీకి మొగ్గు చూపారోనని అన్ని పార్టీల నేతలు ఆరా తీస్తున్నారు. 

స్కీములపై కాంగ్రెస్​ ధీమా

రూరల్​ ఓటింగ్​ అంతా తమ ఖాతాలోకి వస్తుందనే ధీమాను కాంగ్రెస్​ పార్టీ వ్యక్తం చేస్తున్నది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ .. అధికారంలోకి వచ్చిన కొన్నిరోజుల్లోనే అమలులోకి తెచ్చిన ముఖ్యమైన స్కీములు లాభం చేకూరుస్తాయని భావిస్తున్నది. అధికారంలోకి వచ్చిన రెండో నెల నుంచే ప్రతి నెలా 10వ తేదీ లోపు ఆసరా పెన్షన్లు పంపిణీ చేయడంతో 60 ఏండ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తమ పార్టీ​వైపు మొగ్గుచూపినట్లు కాంగ్రెస్​ నేతలు అంచనా వేసుకుంటున్నారు.

ఇక రైతుభరోసా పంపిణీని పోలింగ్​ కంటే నాలుగు రోజుల ముందే పూర్తి చేయడం,  పంద్రాగస్టులోపు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం వల్ల రైతులు కూడా తమవైపు నిలిచి ఉంటారని కాంగ్రెస్​ లెక్కలు వేసుకుంటున్నది. రాష్ట్రంలో 1.67 కోట్ల మంది మహిళ ఓటర్లు ఉండగా.. ఇందులో 70 శాతం ఓట్లు రూరల్​ ఏరియాల్లోనివే.  

బీజేపీ, బీఆర్​ఎస్ అంచనాలేంది?

గ్రామాల్లో నమోదైన పోలింగ్​పై బీజేపీ, బీఆర్​ఎస్​ ఎటూ తేల్చుకోలేకపోతున్నవి. పట్టణాల నుంచి రూరల్​కు బీజేపీ విస్తరించిందని.. ఆ ఓట్లు తమవేనని ఆ పార్టీ నేతలు బయటికి చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అలా కనిపించడంలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే మోదీ చరిష్మాతో యూత్ ఓట్లు తమకే పడి ఉంటాయని కమలం నేతలు నమ్ముతున్నారు. ఎక్కడెక్కడ ఎంతమంది యూత్ ఓటర్లు ఉన్నారో లెక్కలు తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. ఇక.. కరెంట్​, నీళ్లు, కల్యాణ లక్ష్మి

రుణమాఫీ వంటివాటిపై కాంగ్రెస్​ పార్టీపై తమ పార్టీ చీఫ్​కేసీఆర్ చేసిన విమర్శలతో గ్రామాల్లో మళ్లీ ఓటు తమ వైపే టర్న్​ అయి ఉంటుందని బీఆర్​ఎస్​ లీడర్లు భావిస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్​ ఓటర్లతోనే కాంగ్రెస్​ అధికారాన్ని చేపట్టింది. రైతులు, యువత, మహిళలు బీఆర్ఎస్​ను పక్కన పెట్టి.. కాంగ్రెస్​కు జై కొట్టారు. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్​ పార్టీ క్యాడర్​ కూడా చెల్లాచెదురైంది. ఇంకా రూరల్​లో ఓట్లు పడి ఉంటాయా అనే అనుమానం కూడా ఆ పార్టీ నుంచే వస్తున్నది.

కిందిస్థాయి లీడర్లు మాత్రం వాస్తవ విషయం తెలిసిప్పటికీ పైకి పాజిటివ్​గా రిపోర్టు ఇస్తున్నట్లు సమాచారం.  స్టేట్​ యూనిట్​గా చూస్తే కాంగ్రెస్​ వర్సెస్​ బీజేపీ అన్నట్లుగా లోక్​సభ ఎన్నికలు జరిగాయి. ఓటర్లు కూడా నేషనల్​ ప్రాస్పెక్టివ్​లోనే ఈ ఎన్నికలను చూసినట్లు చర్చ జరుగుతున్నది. 

తారుమారు చేసేది రూరల్​ ఓటే!

పార్లమెంట్​ నియోజకవర్గాల వారీగా చూస్తే.. 13 సెగ్మెంట్లలో ప్రతి సెగ్మెంట్​లో యావరేజ్​గా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తిగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవే ఉన్నాయి. రెండు, కొన్నిచోట్ల మూడు చొప్పున పూర్తిగా అర్బన్​ లేదా 75 శాతం మేర పట్టణ ప్రాంత ఓటర్లను కలిగి ఉన్నాయి. మిగిలిన నాలుగింటిలో సికింద్రాబాద్, హైదరాబాద్​, మల్కాజ్​గిరిల్లో పూర్తిగా, చేవెళ్లలో కొంత పార్ట్​  పట్టణ ప్రాంతంలో ఉన్నది.

అర్బన్​ అసెంబ్లీ నియోజకవర్గాలతో చూస్తే రూరల్​ నియోజకవర్గాల్లో యావరేజ్​గా 68 శాతం నుంచి 75 శాతం మేర పోలింగ్​ నమోదైంది. కొన్ని చోట్ల 80 శాతానికి చేరింది. అదే పట్టణ ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాల్లో 58% నుంచి 65% లోపు ఉన్నది. ఈ లెక్కన గెలుపోటము లను, మెజార్టీని తారుమారు చేసేది పూర్తిగా రూరల్​ ఓటు బ్యాంకే కావడంతో మరింత లోతు గా పార్టీలు  ఫీడ్​ బ్యాక్​తెప్పించుకుంటున్నాయి.