అమ్ముకున్నంక పెరుగుతున్న ఉల్లి రేట్లు.. వ్యాపారుల దగ్గరికి చేరాక క్రమంగా పెరుగుతున్న రేట్లు

  • మూడు నెలల క్రితం రూ. 7 చొప్పున అమ్ముకున్న రైతులు
  • ఉత్పత్తులు దాచుకోలేక మునుగుతున్న ఫార్మర్స్​, వినియోగదారులు

కామారెడ్డి, వెలుగు:  జిల్లాలో రైతులు అమ్ముకున్నాక ఉల్లి గడ్డ ధరలు పెరుగుతున్నాయి. పెరిగిన ధరలతో  రైతులు, వినియోగదారులు నష్టపోతుండగా దళారులు లాభపడుతున్నారు. మూడు  నెలల క్రితం అధికంగా ఉల్లి దిగుబడి వచ్చినపుడు   మార్కెట్లో  ఒక్కసారిగా రేటు​ పడిపోయింది.  కిలోకు రూ. 7 నుంచి రూ.10  మధ్య పంటను  అమ్ముకోవాల్సి వచ్చింది.  నామమాత్రంగానే  రైతులకు  గిట్టుబాటు అయ్యింది.  రేటు లేక  రైతులు  ఆవేదన చెందారు. ఇప్పుడు  మార్కెట్లో  పెరుగుతున్న  ధరలతో వినియోగదారులు నష్టపోతున్నారు. ప్రస్తుతం కామారెడ్డి మార్కెట్లో  కిలో తెల్ల ఉల్లి  రేటు రూ.40 కి చేరింది.   ఎర్ర ఉల్లి  కిలోకు రూ.25 పలుకుతోంది.  

జిల్లాలో  వెయ్యి  ఎకరాల్లో.. 

వారం,  పది రోజులుగా   కామారెడ్డి మార్కెట్లో  ఉల్లి రేటు ​క్రమేపీ పెరుగుతోంది.   స్థానిక అవసరాలకు అనుగుణంగా  జిల్లాలో  ఉల్లి  దిగుబడులు సరిపోవటం లేదు.  సాగు విస్తీర్ణం  తక్కువ ఉండడంతో,  పంట ఉత్పత్తులు నిల్వ ఉంచే కోల్డ్ స్టోరేజీలు లేవు.   కొందరు రైతులు  తమ అవసరాల నిమిత్తం  సాగు చేసుకుంటే,  మరి కొందరు రైతులు   మార్కెట్లో అమ్మకం కోసం  అర ఎకరం నుంచి 2 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు.   జిల్లా వ్యాప్తంగా  వెయ్యి  ఎకరాల్లో  మాత్రమే ఉల్లి పంట సాగవుతోంది.  దీంతో ప్రజల అవసరాల కోసం  మహారాష్ర్ట  నుంచి ఉల్లి దిగుబడులు  దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.  అక్కడ పంట ఉత్పత్తులు రైతుల చేతికి రాగానే  అతి తక్కువ రేటు​కు వ్యాపారులు కొనుగోలు  నిల్వ చేస్తున్నారు. ఆయా చోట్ల  స్థానిక నిల్వలు అయిపోగానే  వ్యాపారులు ఎక్కువ రేటు​కు సప్లయ్​ చేస్తున్నారు.  ఆరుగాలం  శ్రమించే  రైతుకు గిట్టుబాటు ధర​ దక్కడం లేదు.   మార్కెట్ లో  సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేని స్థితికి ఉల్లి ధర క్రమేపీ పెరుగుతోంది.

ALSO READ :కుక్కల దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు.. 

 తుట్టికి పావు సేరు అమ్మినఅర ఎకరంలో   ఉల్లి పెట్టినం.  

 4 నెలల క్రితం  మార్కెట్ కు​ తెచ్చి  అమ్మితే  రేట్​ లేదు.  తుట్టికి పావు సేరు అమ్మిన.   కిలోకు రూ. 10 కి అమ్మిన. గిప్పుడు  మా దగ్గర ఉల్లి గడ్డ లేదు.  మార్కెట్​లో కిలోకు రూ.40  అమ్ముతున్రు.   మా దగ్గర ఉన్నప్పుడు  మాత్రం రేట్ ఉండదు.  

అనురాధ,   రైతు

రూ.40కి చేరువలో

 కామారెడ్డి మార్కెట్ లో 10 రోజుల క్రితం ఉల్లి  రేటు కిలోకు రూ.25 ఉంది.  ప్రస్తుతం తెల్ల ఉల్లి కిలోకు రూ.40కి చేరింది.  ఎర్ర ఉల్లి ప్రస్తుతం కిలోకు రూ.25 ఉండగా  కొద్ది రోజుల క్రితం 15 నుంచి రూ.2‌‌0 వరకు ఉంది.  ప్రస్తుతం  రైతుల దగ్గర ఉల్లి  నిల్వలు లేవు.  మహారాష్ర్టలోని  ఔరంగాబాద్,  నాందేడ్​ ఏరియాల నుంచి  రోజుకు  రెండు డీసీఎంలలో  250 నుంచి  300  క్వింటాళ్ల స్టాక్​ వస్తోంది.  మన దగ్గర లేకపోవటం,  మహారాష్ట్రలో  పంట సాగు విస్తీర్ణం  తక్కువగా ఉందని,   రవాణా చార్జీలు  బాగా పెరిగాయని  తదితర కారణాలతో  రేటు పెరుగుతోందని వ్యాపారులు పేర్కొంటున్నారు.  స్థానిక అవసరాలకు అనుగుణంగా  సాగు విస్తీర్ణం పెంపుపై  ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోవటంతో  ఉల్లి రేట్లు  పెరిగి   సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితి వస్తోంది.