వరంగల్ ఎజెన్సీ ప్రాంతంలోని భూముల ధరలు ఒక్కసారిగా ఆకాశన్నంటాయి. పంటలు పండే పచ్చని భూములు కాసులు పండిస్తున్నాయి.నిన్నమొన్నటి వరకూ ఎకరం 20 లక్షల లోపే ఉన్న రేటు ఇప్పుడు కోటి రూపాయలు దాటింది. రామప్పకు యునెస్కో గుర్తింపుతో రియల్ జోరు పెరిగింది.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట ఓ చిన్న గ్రామం. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించింది. వరల్డ్ టూరిజం మ్యాప్ లో చోటు సంపాధించుకుంది. కాకతీయలు కాలం నాటి రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపుతో పాలంపేట వైపు అందరి చూపు మళ్లింది. కాకతీయులు పాలంపేట గ్రామంలో రామప్ప ఆలయంతో పాటు చెరువును కూడా నిర్మించారు. దీని కింద 5 వేల 100 ఎకరాల్లో పంటలు సాగవుతుంటాయి. మరో 5వేల ఎకరాల్లో అనధికారికంగా పంటలకు నీరందుతోంది. రామప్ప చుట్టూ ఉన్న పదికిపైగా గ్రామాలకు రామప్ప చెరువే జీవనాధారం. ఆ పల్లెల్లో మరో వెయ్యి ఎకరాల్లో రెండు పంటలకు సాగునీరు అందుతోంది. రెండేళ్ల కిందటి వరకూ ఇక్కడి వ్యవసాయ భూములకు పెద్దగా ధరలు ఉండేవి కావు. యునెస్కో ప్రతిపాధన తెరపైకి వచ్చినప్పటి నుంచి 8 నుంచి 10 లక్షలు ఎకరం ఉన్న భూమి 20 లక్షల వరూ ధర పెరిగింది. ఇప్పుడు ఒక్క వారం పదిరోజుల్లోనే ఈ ధర అమాంతం కోటిని దాటింది.
రామప్పకు యునెస్కో గుర్తింపు దక్కడంతో రియల్బూమ్పతాక స్థాయికి చేరింది. ఆలయ సమీపంలో ఎకరా భూమి ధర రెక్కలు వచ్చాయి. మరోవైపు సింరేణి ఓపెన్ కాస్ట్ గని అందుబాటులోకి రానుండడంతోనూ రియల్ ఎస్టెట్ వ్యాపారుల దృష్టిపడింది. వెంకటాపూర్, లింగాపూర్ గుట్టల్లో ఓపెన్ కాస్ట్ గనికోసం సింగరేణి పనులు మొదలు పెట్టింది. దీంతో రామప్పకు మండల కేంద్రమైన వెంకటాపూర్లో నూ ఎకరాకు 80లక్షల వరకు భూముల ధర పెరిగింది. ఈ గ్రామంలో 8 వేల 540 పట్టా భూములు ఉన్నాయి. రామప్పకు పక్కనే ఉన్న రామానుజపురంలో 3,945 ఎకరాల్లో పట్టా భూములు ఉన్నాయి. జంగాలపల్లి, ఇంచెర్ల గ్రామాలతో పాటు భూపాలపల్లి జిల్లా గణపురం, గాంధీనగర్గ్రామం వరకు కూడా భూముల ధరలు అకాశాన్నంటుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంతో ఇక్కడ అనేక అభివృద్ది కార్యక్రమాలు జరగనున్నాయి. విదేశీ పర్యాటకులకు అనుగుణంగా ఫెసిలిటీస్ కల్పించాల్సి ఉంటుంది. రామప్పతోపాటు రెండేళ్లకో సారి జరిగే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సక్కమ్మసారలమ్మ , లక్నవరం, బోగత, తాడ్వాయి దట్టమైన అటవీ అందాలతో టూరిజం హబ్ గా ఉంది. దీంతో ఇక్కడ రీసార్ట్, స్టార్ హోటల్స్ రానున్నాయి. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో రియల్టర్లు వాలిపోయారు. హైదరాబాద్, వరంగల్ తోపాటు స్థానికంగా ఉన్న నేతలు దేవాలయం చుట్టుపక్కల భూములు కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా ధరలు పెంచి రైతులకు ఆశలు చూపుతూ అమ్మాలని ఒత్తిడి తెస్తున్నారు.కొందరు రైతులు పంటలు పండించుకునే భూములు అమ్మమని చెబుతున్నారు. రేట్లు పెరగడంతో కౌలుకు తీసుకుని, వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ...ఎకరమో.. అరెకరమో కొన్నుక్కుందామనుకున్న పేదల ఆశలు అడియాసలయ్యాయి.
పాలంపేట, పరిసర గ్రామాల్లో రియల్ ఎస్టేట్ పారం జోరందుకోవడంతో ప్రభుత్వ భూముల ఆక్రమణలు పెరిగిపోయే అవకాశం ఉంది. పాలంపేట, వెంకటాపూర్, రామానుజపురం గ్రామాల్లో 30 వేల 161 ఎకరాల్లో అటవీ భూములు, 36 వేల 834 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే చాలా వరకు కబ్జాకు అయింది. కొన్ని చోట్ల రైతులు కాస్తులో ఉన్నారు. ఈ భూములను భవిష్యత్ అవసరాలకు, అభివృద్ది కోసం రక్షించే విధంగా సర్కార్ దృష్టి పెట్టాలంటున్నారు జనం.