సింగరేణి ఉద్యోగులకు.. ఇవాళ పెరిగిన జీతాలు

  • 11వ వేజ్ బోర్డు వేతనాలను అమలు చేయాలని యాజమాన్యం నిర్ణయం
  •  41 వేల మందికి ప్రయోజనం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: జాతీయ స్థాయిలో ఇటీవల కుదిరిన 11వ వేజ్ బోర్డు వేతనాలను సింగరేణి కార్మికులకు వెంటనే అమలు చేయాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేసి, జూన్ నెల జీతాలను సోమవారం కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. గతంలో వేజ్ బోర్డు నిర్ణయాలు జరిగిన తర్వాత జీతాల చెల్లింపునకు నెలల తరబడి సమయం పడుతుండేది. కోల్‌‌‌‌ ఇండియాలో అమలు చేసిన తర్వాతనే సింగరేణిలో చేసే వాళ్లు. ఈసారి అందుకు భిన్నంగా కోల్ ఇండియా కన్నా ముందే సింగరేణి కార్మికులకు కొత్త వేజ్‌‌‌‌ బోర్డు జీతాలు అందిస్తున్నారు.

తాజా నిర్ణయంతో 41 వేల మంది కార్మికులు, ఉద్యోగులు, సూప‌‌‌‌ర్‌‌‌‌వైజ‌‌‌‌ర్లకు ప్రయోజ‌‌‌‌నం చేకూరనుంది. కొత్త జీతాల అమలుతో సింగరేణి యాజమాన్యం ఏడాదికి రూ.1,000 కోట్ల అదనపు వ్యయాన్ని భరించనుంది. కార్మికుల కోరిక మేరకు కొత్త జీతాలను వెంటనే అమలు చేయాలని నిర్ణయించామని సంస్థ డైరెక్టర్‌‌‌‌ బలరాం తెలిపారు. ఐదేళ్లకు ఒకసారి బొగ్గు గని ఉద్యోగుల వేతనాలను చర్చించి, నిర్ణయించే జేసీసీఐ 11వ సమావేశాలు ఇటీవల ముగిశాయి.

జీతాల పెరుగుదల ఇలా..

  •     డైలీ రేటెడ్ కేటగిరీ 1 బేసిక్ గతంలో రోజుకు రూ.1,011.27 ఉండగా.. ఇప్పుడు రోజుకు రూ.1,502.66కి పెరిగింది.
  •     మంత్లీ రేటెడ్ ఏ1 గ్రేడ్ బేసిక్ ఇంతకుముందు నెలకు రూ.98,485.79 ఉండేది. ఇప్పుడు నెలకు రూ.1,46,341.67 అయింది.
  •     మారిన కొత్త బేసిక్‌‌‌‌ పే ప్రకారం డైలీ రేటెడ్ కేటగిరీ 1 ఉద్యోగి నెలకు రూ.59,386.57 జీతంగా పొందనున్నారు.
  •     మంత్లీ రేటెడ్ అండర్ గ్రౌండ్ ఏ1 గ్రేడ్‌‌‌‌లో గరి ష్ట బేసిక్ రూ.1,46,341.67 ఉన్న ఉద్యోగులు.. ఇకపై నెలకు రూ.2,16,618.74 జీతంగా పొందనున్నారు.