దోమల పంజా.. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న దోమల బెడద

దోమల పంజా.. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న దోమల బెడద
  • క్షేత్రస్థాయిలో పెరిగిపోతున్న విషజ్వరాలు, డెంగ్యూ కేసులు
  • ఫాగింగ్ చేస్తున్నామంటున్న జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు
  • అరకొర పనులతో చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు

వానాకాలం వచ్చిందంటే చాలు.. దోమలు వణుకు పుట్టిస్తాయి.. పారిశుధ్యలేమికి తోడు అధికారుల అలసత్వంతో దోమలు పెరిగి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. 

హనుమకొండ, వెలుగు: గ్రేటర్​ వరంగల్​లోని నీటి నిల్వ ప్రాంతాల్లో దోమలు పెరిగిపోయి సిటీపై పంజా విసురుతున్నాయి. నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన ఆఫీసర్లు అరకొర ఫాగింగ్​చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో విష జ్వరాలు, డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయి. గత నెలతో పోలిస్తే ఈ నెలలో ఈ కేసులు మరింత పెరిగినట్లు ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. దోమల నివారణకు సరైన చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్​చేస్తున్నారు.

నీటి నిల్వ ప్రాంతాలే నిలయాలు..

పట్టణంలోని ఓపెన్​ప్లాట్లలో నీరు నిలవడంతో దోమలకు నిలయాలుగా మారాయి. వరంగల్ నగరంలోని 66 డివిజన్ల పరిధిలో 1,500 వరకు కాలనీలు ఉండగా, 2.5 లక్షల ఇండ్లు 11 లక్షల జనాభా ఉంది. నగర వ్యాప్తంగా 3 వేలకు పైగా ఓపెన్ ప్లాట్లు ఉండగా, ఇటీవల కురిసిన వర్షాలకు అవన్నీ మురికికూపాలను తలపిస్తున్నాయి. ఆయిల్ బాల్స్, యాంటీ లార్వా ప్రోగ్రామ్స్ చేపట్టకపోవడంతో నీరు నిలిచిన ఓపెన్ ప్లాట్లలో దోమల పెరిగిపోయాయి. సిటీలోని స్లమ్ ఏరియాలతోపాటు విలీన గ్రామాల్లో సమస్య తీవ్రంగా మారగా, సాయంత్రం అయ్యిందంటే చాలు నగర వాసులు దోమలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

కోట్లు ఖర్చు చేస్తున్నా తీరని బెడద..

దోమల నివారణకు గ్రేటర్ ఆఫీసర్లు ప్రతి డివిజన్ లో ఫాగింగ్ చేయాల్సి ఉంటుంది. జీడబ్ల్యూఎంసీలో నాలుగు ఆటో ఫాగింగ్ మెషిన్లు, 32 హ్యాండ్ మెషీన్లు ఉండగా, ఆటోలకు డీజిల్, పెట్రోల్, దాదాపు 173 మంది అర్బన్​ మలేరియా వింగ్ సిబ్బందికి జీతభత్యాలు ఇలా వివిధ అవసరాల కోసం ఏటా సుమారు రూ.2 కోట్లకుపైగానే ఖర్చు చేస్తున్నారు. ఆయా నిధులతో చిన్న మెషిన్లకు ప్రతిరోజు 5 లీటర్ల డీజిల్, ఒక లీటర్ పెట్రోల్, ఆటోలకు 40 లీటర్ల డీజిల్, 10 లీటర్ల వరకు పెట్రోల్ ఇస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. 

కానీ, కొంతమంది సిబ్బంది ఫాగింగ్ అవసరాలకు వినియోగించాల్సిన పెట్రోల్, డీజిల్ ను సగం కూడా ఖర్చు చేయకుండానే పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. డివిజన్లలో కొంతమేర ఫాగింగ్ చేయడం, ఆ తర్వాత తమకు తెలిసిన వాళ్లతో సంతకాలు తీసుకుని వెళ్లిపోతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ విషయంపై గ్రేటర్ కమిషనర్ ఫోకస్ పెడితే అసలు విషయాలు బయటపడతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పెరుగుతున్న డెంగ్యూ కేసులు

గ్రేటర్ సిటీలో దోమల నివారణ చర్యలు నామమాత్రంగానే ఉంటుండటంతో క్షేత్రస్థాయిలో విష జ్వరాలు, డెంగ్యూ బాధితులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. నగరంలో 183 స్లమ్ ఏరియాలు ఉండగా, ఆ ప్రాంతాల్లో జ్వర బాధితులు ఎక్కువగా ఉంటున్నారు. వరంగల్ ఎంజీఎంలో నమోదు అవుతున్న డెంగ్యూకేసులే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇక్కడ ప్రతిరోజు అన్ని విభాగాలు కలిపి 2 వేలకు పైగా ఓపీ నమోదు అవుతుండగా, అందులో జ్వర బాధితులే ఎక్కువ మంది ఉంటున్నారు. కేవలం ఆగస్టు నెలలోనే దాదాపు 164 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. 

ALSO READ : కాళేశ్వరం ప్రాజెక్టును నమ్మలేకే గంధమల్ల ను తగ్గించినం : ఉత్తమ్​కుమార్​ రెడ్డి

ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే వారు రెట్టింపు సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. హనుమకొండలో గతంలో ఎన్నడూ లేనంతగా డెంగ్యూ కేసులు పెరిగిపోయాయి. జులైలో 7 డెంగ్యూ కేసులు నమోదు కాగా, ఆగస్టులో ఆ సంఖ్య 33కు చేరింది. ఇప్పటివరకు 55 కేసులు నమోదు కావడం గమనార్హం. 8 మందికి టైఫాయిడ్ సోకగా, 691 రెస్పిరేటరీ ఇన్ ఫెక్షన్స్ ఉన్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. వాతావరణ మార్పులతో వరంగల్ నగరంలో దోమలు విజృంభిస్తుండటం, డెంగ్యూ కేసులు పెరిగిపోతుండటం కలవరపెడుతుండుతున్నది. దోమల నివారణకు ఆఫీసర్లు తగిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఫాగింగ్​ చేస్తలేరు..

మున్సిపల్​ సిబ్బంది ఎక్కడా ఫాగింగ్​ చేయడం లేదు. దోమలు పెరిగిపోయి విష జ్వరాలు వ్యాప్తి చెంది, జనాలు ఆస్పత్రుల బాట పడుతున్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోట్లేదు. ఉన్నతాధికారులైనా దృష్టి సారించి, దోమల నియంత్రణకు చర్యలు చేపట్టాలి. 

సుంకరి ప్రశాంత్, ఆరెపల్లి