ఎక్కడ చూసినా కరోనానే!..అటెండర్ల నుంచి పెద్దాఫీసర్ల వరకూ బాధితులే

ఎక్కడ చూసినా కరోనానే!..అటెండర్ల నుంచి పెద్దాఫీసర్ల వరకూ బాధితులే
  • ఇప్పటికే 79 మంది డాక్టర్లు, సిబ్బందికి సోకిన మహమ్మారి
  • దవాఖాన్ల పాలవుతున్న పోలీసులు, జర్నలిస్టులు
  • ఆఫీసులకు రావాలంటే భయపడుతున్న ఉద్యోగులు
  • ఇండ్ల నుంచే పనిచేస్తున్న టాప్​ ఎగ్జిక్యూటివ్​లు

హైదరాబాద్, వెలుగువేల మంది ఉద్యోగులున్న జీహెచ్ఎంసీ ఆఫీసు.. రోజూ వందలాది మంది వచ్చిపోయే సెక్రటేరియట్.. రాష్ట్ర పరిపాలనకు కీలకమైన సీఎం ఆఫీసు.. సర్కారీ, ప్రైవేటు, కార్పొరేట్​ హాస్పిటళ్లు.. ఇలా ఎక్కడ చూసినా కరోనానే. అటెండర్ల నుంచి ఐఏఎస్‌, ఐపీఎస్‌ఆఫీసర్ల వరకు, మంత్రులు వచ్చే ఆఫీసుల్లో సిబ్బందికి వైరస్​ పాజిటివ్​ రావడం కలకలం రేపుతోంది. హాస్పిటళ్లలో నర్సులు, ల్యాబ్​ టెక్నీషియన్ల నుంచి పెద్ద డాక్టర్ల దాకా కరోనా అంటడం ఆందోళన కలిగిస్తోంది. చాలా చోట్ల పోలీస్ స్టేషన్లలో, పోలీస్​ కమిషనర్​ ఆఫీసులో కూడా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక చాలా ప్రైవేటు ఆఫీసుల్లోని ఉద్యోగులకూ సోకింది. వైరస్ లక్షణాలు ఉన్నవాళ్లు, లేనివాళ్లు యథేచ్చగా తిరుగుతుండడంతో ఎక్కడెవరికి, ఎలా వైరస్‌సోకుతుందో కూడా అంతు చిక్కని పరిస్థితి ఉందని డాక్టర్లే అంటున్నారు. సర్కారు టెస్టులు చేస్తే పెద్ద సంఖ్యలో కేసులు వచ్చే చాన్స్​ ఉందని చెప్తున్నారు. రెండు రోజుల కింద సీఎం ఆఫీసులో పనిచేసే ఓ ఉద్యోగికి వైరస్ పాజిటివ్​రాగా మూడు రోజుల పాటు తాళం వేశారు.

అక్కడ పనిచేసేవాళ్లందరినీ ఇండ్లకే పరిమితం చేశారు. మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు, వందల సంఖ్యలో ఉద్యోగులుండే స్టేట్ సెక్రటేరియట్లో పనిచేస్తున్న ఇద్దరు అటెండర్లకు కరోనా సోకింది. ఈ ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందినవాళ్లు. ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్లో పనిచేస్తున్నారు. శనివారం ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​ ఉన్నతాధికారి ఒకరు పలు శాఖల ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. వీరందరికీ కొందరు అటెండర్లు నీళ్లు, చాయ్‌‌లు, ఫైళ్లు అందించారు. ఇందులో ఇద్దరికి సోమవారం వైరస్ పాజిటివ్ రావడంతో ఆందోళన మొదలైంది. ఉద్యోగులందరినీ ఇండ్లకు పంపిన అధికారులు.. ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​ ఉన్న ఫ్లోర్ మొత్తాన్ని డిసిన్‌‌ఫెక్ట్‌‌చేయించారు. ఐదు రోజుల పాటు ఎవరూ ఆఫీసుకు రావొద్దని, ఇంట్లోనే క్వారంటైన్‌‌లో ఉండాలని సూచించారు.

జీహెచ్ఎంసీ ఆఫీసులో కూడా..

సెక్రటేరియట్ పక్కనే ఉండే జీహెచ్‌‌ఎంసీ కార్యాలయంలో సోమవారం ఓ ఉద్యోగికి పాజిటివ్‌‌గా తేలింది. ఆఫీసు బిల్డింగ్‌‌లోని నాలుగో అంతస్తులో ఆయన పనిచేస్తున్నాడు. దాంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు షాక్‌‌కు గురయ్యారు. కమిషనర్‌‌లోకేశ్‌‌కుమార్‌‌అలర్ట్​ అయి ఉద్యోగులందరినీ ఇంటికి పంపించారు. బిల్డింగ్‌‌మొత్తాన్ని డిసిన్‌‌ఫెక్ట్ చేశారు. కరోనా పాజిటివ్‌‌గా తేలిన ఉద్యోగిని ఇటీవల ఎవరెవరు కలిశారనే సమాచారం సేకరిస్తున్నారు. నాలుగో అంతస్తులో పనిచేసే ఉద్యోగులంతా హోమ్‌‌క్వారంటైన్‌‌లో ఉండాలని ఆదేశించారు. సికింద్రాబాద్ కమర్షియల్ ట్యాక్స్‌‌ఆఫీసులోనూ సోమవారం ఓ వ్యక్తికి కరోనా కన్ఫామ్‌‌అయింది. దాంతో ఉద్యోగులందరినీ ఇండ్లకు పంపించారు. ఇటీవలే హైదరాబాద్‌‌పోలీస్ కమిషనర్ ఆఫీసులో ఒకరికి, డీజీపీ ఆఫీసులో ఒకరికి, పబ్లిక్‌‌హెల్త్ డైరెక్టర్ కార్యాలయంలో ఇంకొకరికి వైరస్ పాజిటివ్‌‌వచ్చింది.

ఉద్యోగాలకు పోవుడెట్ల?

సీఎం ఆఫీసు సహా ఐఏఎస్‌‌, ఐపీఎస్‌‌ఆఫీసర్లు ఉండే చోట కరోనా కేసులు బయటపడుతుండటంతో ఎంప్లాయీస్​ భయపడుతున్నారు. ఐఏఎస్‌‌, ఐపీఎస్ ఆఫీసర్లు సైతం సాధ్యమైనంత వరకూ ఇంటి దగ్గరి నుంచే పనిచేస్తున్నారు. ఇంటికే ఫైళ్లు తెప్పించుకుని, ఆర్డర్లు జారీ చేస్తున్నారు. ఉద్యోగుల్లోనూ కొందరు ఆఫీసులకు రావట్లేదు. సెక్రటేరియట్‌‌లో సోమవారం 30 శాతం మంది ఆబ్సెంట్ అయ్యారు. ఉద్యోగుల్లో కేసులు పెరుగుతున్నకొద్దీ.. హోం క్వారంటైన్‌‌లో ఉండే ఆఫీసర్ల సంఖ్య పెరుగుతోంది. చాలా మంది ప్రైవేటు ఉద్యోగులకు వైరస్ అంటుకుంది. ఇప్పటికే చాలా ఆఫీసుల్లో వర్క్‌‌ఫ్రమ్‌‌హోంకు అవకాశమిచ్చారు. ఇప్పుడు మరిన్ని కంపెనీలు అదే దారిలో వెళ్తున్నాయి. కరోనా ఎవరి నుంచి వస్తుందో తెల్వక, ఇప్పటికే చాలా ఆఫీసుల్లో పరిమిత సంఖ్యలో విజిటర్స్‌‌ను అనుమతిస్తున్నారు. ఇకపై విజిటర్స్ రాకను పూర్తిగా బంద్ పెట్టి.. ప్రత్యామ్నాయ మార్గంలో పనులు చక్కబెట్టాలని యోచిస్తున్నారు. రానున్న రెండు వారాల పాటు అరణ్య భవన్‌‌లోకి విజిటర్స్‌‌ను అనుమతించొద్దని అటవీ శాఖ ఇప్పటికే నిర్ణయించింది. ఆఫీసు మొత్తాన్ని శానిటైజ్ చేయనున్నారు.

రూల్స్​ అన్నీ గాలికే..

ప్రతి ఆఫీసులో శానిటైజర్లు పెట్టాలని, టెంపరేచర్‌‌‌‌చెక్ చేయాలని సర్కారు జారీ చేసిన ఉత్తర్వులు.. సర్కారీ ఆఫీసుల్లోనే అమలు కావడం లేదు. బల్దియా హెడ్డాఫీసులో 2 వేల మంది ఉద్యోగులు పనిచేస్తరు. రోజుకు 500 మంది వరకు జనం వస్తారు. అయినా రెండు ద్వారాల వద్ద ఎక్కడా థర్మల్‌‌ స్క్రీనింగ్‌‌ నిర్వహించడం లేదు. సోమవారం ఓ ఉద్యోగికి పాజిటివ్‌‌రావడంతో ఆఫీసర్లు హడావుడి చేశారు. థర్మల్‌‌ స్క్రీనింగ్‌‌ మెషీన్లను బయటకు తీసి.. పరీక్షించడం మొదలుపెట్టారు. దీంతో బల్దియా అడ్మినిస్ట్రేషన్‌‌విభాగం తీరుపై ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. చాలా సర్కారీ ఆఫీసుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడా శానిటైజర్లు అందుబాటులో ఉంచడం లేదు. టెంపరేచర్‌‌‌‌ చెక్ చేయడం లేదు. ప్రైవేటు ఆఫీసులు, ఫ్యాక్టరీల్లో పట్టించుకునే దిక్కే లేదు.

అసలు కథ ఇప్పుడే మొదలైంది

రాష్ట్రంలో ఇంకా కరోనా ఎఫెక్ట్​ బయటపడలేదని.. అసలు ప్రమాదం ఇప్పుడే మొదలైందని ఎపిడెమాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. టెస్టులు కరెక్టుగా చేస్తే నెల రోజుల్లో కేసుల సంఖ్య రెండు లక్షలు దాటుందని అంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే వైరస్ ప్రతి ఇంటికి విస్తరిస్తుందని హెచ్చరిస్తున్నారు. వైరస్ కమ్యూనిటీలోకి వెళ్లిపోయిందని, చాలా మంది తమకు తెలియకుండానే వైరస్‌‌ను వ్యాప్తి చేస్తున్నారని చెప్తున్నారు. ‘‘కరోనా చైన్‌‌బ్రేక్ చేయడం కష్టం. వ్యాక్సినో, హెర్డ్ ఇమ్యునిటీనో రావాల్సిందే. అప్పటిదాకా టెస్టులు ఎక్కువగా చేస్తూ.. ఒకేసారి ఎక్కువ మందికి వైరస్ సోకకుండా చూసుకోవడమే మార్గం. వేల మంది పేషెంట్లకు ట్రీట్‌‌మెంట్​ ఇచ్చేందుకు అనుకూలంగా హాస్పిటళ్లను సిద్ధం చేయాలి’’ అని డాక్టర్‌‌‌‌బుర్రి రంగారెడ్డి వివరించారు.

అమ్మో.. హైదరాబాద్‌‌

20 రోజుల క్రితం వరకూ గ్రేటర్ హైదరాబాద్‌‌లోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వైరస్‌‌.. ఇప్పుడు సిటీ అంతటా విస్తరించింది. కాలనీకో కంటెయిన్‌‌మెంట్ ఇల్లు కనిపిస్తోంది. అనేక మందికి కరోనా సోకింది. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో పనిచేసే డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌‌స్టాఫ్‌‌కు వైరస్ అంటుకుంది. కూరగాయలు అమ్ముకునే వ్యక్తులకు, కిరాణ షాపు ఓనర్లకూ పాజిటివ్ వచ్చింది. దీంతో ఎక్కడికి వెళ్లాలన్నా జనం జంకుతున్నరు. రాష్ట్రంలో 2,300 కేసులు జీహెచ్‌‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. ఇంకా కేసులు వస్తూనే ఉన్నాయి. దీంతో హైదరాబాద్ కు రావాలంటేనే జిల్లాల్లో జనాలు భయపడుతున్నరు. ఉద్యోగం పోతేపోనీ ఇంటికిరా అంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌‌నుంచి పోయినోళ్లను ఊర్లలో జనం భయంభయంగా చూస్తున్నారు. హైదరాబాద్​ నుంచి జిల్లాలు, ఊర్లకు రాకపోకలు తగ్గినయి. బస్సుల్లో సగం సీట్లు కూడా నిండకపోవడంతో ట్రిప్పుల సంఖ్య తగ్గిస్తున్నారు. లాక్‌‌డౌన్ సడలింపులు, వలస కూలీల రాకతో జిల్లాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి.

8 రోజుల్లోనే వెయ్యి కేసులు

గత వారం రోజుల్లోనే 955 కేసులు, 55 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కమ్యునిటీ స్ప్రెడ్​ స్థాయికి చేరిందని.. ఆఫీసర్లు ఆఫ్‌‌ది రికార్డుగా చెప్తున్నారు. గత ఎనిమిది రోజుల్లోనే వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మార్చి 2న తొలికేసు నమోదైంది. ఏప్రిల్ 26వ తేదీ నాటికి కేసుల సంఖ్య 1,001కి చేరుకుంది ఇందుకు 56 రోజులు పట్టింది. ఇక మే 26వ తేదీ నాటికి రెండు వేలకు చేరింది. దీనికి నెల రోజులు పట్టింది. గత నెల 27 నుంచి ఈ నెల మూడో తేదీ నాటికి.. అంటే ఎనిమిది రోజుల్లోనే కేసులు రెండు వేల నుంచి మూడు వేలకు పెరిగాయి. టెస్టుల సంఖ్య పెంచితే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

తెలంగాణలో మరో 92 మందికి కరోనా