నాగర్ కర్నూల్, వెలుగు: నల్లమల అడవిలో జరుగుతున్న అగ్నిప్రమాదాలు వన్యప్రాణులు, చెంచు కుటుంబాల భద్రతకు సవాల్విసురుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలో ఇప్పటికే ఐదు ప్రాంతాల్లో అడవికి నిప్పంటుకుంది. అమ్రాబాద్, మన్ననూరు, మద్దిమడుగు రేంజ్ ల పరిధిలో దాదాపు 24 హెక్టార్ల విస్తీర్ణంలో గడ్డి, చెట్లు తగలబడిపోయాయి. శ్రీశైలం–హైదరాబాద్ మెయిన్ రోడ్డుకు ఇరువైపులా గడ్డి తగలబడి మంటలు విస్తరించడంతో ఫైర్‌ఇంజన్ సహాయంతో అదుపు చేశారు. ఫారెస్ట్ కోర్ఏరియా, అమ్రాబాద్ టైగర్‌రిజర్వ్ ఏరియాలో మంటలు వ్యాపించడం ఫారెస్ట్ సిబ్బందిని కలవరపెడుతోంది. ఈ ప్రాంతాల్లో ఆవాసముండే జంతువులు, వన్యప్రాణులు, పక్షులు ఇక్కడి నుంచి తరలిపోతున్నాయి. లింగాల మండలం నల్లమల అడవిలోని లోతట్టు ప్రాంతమైన రాంపూర్ చెంచుపెంటలో గత నెల 20న అర్ధరాత్రి నిప్పు చెలరేగి నాలుగు పూరి గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. చిగుర్ల లక్ష్మయ్య, నిమ్మల పాపయ్య, నిమ్మల బాలమ్మకు చెందిన మూడు గుడిసెలతో పాటు మినీ అంగన్వాడీ సెంటర్ పూర్తిగా కాలిపోయాయి.
గుడిసెల్లోని వంట సామగ్రి, బట్టలు, దాచుకున్న నగదు మంటల్లో కాలి బూడిదవడంతో మూడు చెంచు కుంటుబాలు కట్టుబట్టలతో మిగిలాయి. దాదాపు రూ.3 లక్షల ఆస్తి నష్టం జరిగిందని చెంచులు వాపోయారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఫిబ్రవరి 27న ఇదే పెంటలో అర్ధరాత్రి చెంచుపెంటలో చిగుర్ల పెద్ద బయన్న గుడిసెకు నిప్పంటుకుంది. దాదాపు రూ. 2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. గత ఏడాది అటవీ ఉత్పత్తుల కోసం 11 మంది చెంచులు అడవిలోకి వెళ్లగా కార్చిచ్చు రేగడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలిస్తే ట్రీట్మెంట్ చేయించుకునే స్థోమత లేక ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు ఇంజెక్షన్లు, మందుల డబ్బుల కోసం అల్లాడిపోయారు.
పాత పద్ధతుల్లోనే మంటల అదుపు
దాదాపు 2.55 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న నల్లమల అడవి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐదు జిల్లాల సరిహద్దుల వెంబడి విస్తరించి ఉంటుంది. ఇందులో సుమారు 1.75 లక్షల హెక్టార్లను రాజీవ్ టైగర్‌జోన్‌గా గుర్తించారు. చెంచుల కదలికలపై పెద్దగా నిషేధం లేకపోయినా మధ్యలో అడ్డుకుంటున్నారనే ఆరోణలు ఉన్నాయి. ఇంత పెద్ద అడవిలో కార్చిచ్చుకు కారణాలు ఏమైనా వాటిని సమర్థంగా ఎదుర్కునే యంత్రాంగం లేకపోవడమే పెద్ద సమస్య గా మారింది. మంటలతో వాచర్లు, ఫీల్డ్‌స్టాఫ్ పోరాడుతున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్జోన్లో తరచూ చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది ఇంకా పాత పద్ధతులనే అవలంబిస్తున్నారు. ఫైర్ఫైటింగ్ఎక్విప్మెంట్స్, లైఫ్సేవింగ్కిట్స్, అత్యవసర సమయాల్లో ఆదుకునేందుకు అంబులెన్సులు కరవవుతున్నాయి. పచ్చి చెట్ల కొమ్మలను తెంపి చుట్టుముట్టే మంటలతో సిబ్బంది యుద్ధం చేస్తున్నారు. మంటలు రేగినప్పుడు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా ఏర్పాటు చేసిన ఫైర్‌లైన్స్ గాలి ఉద్ధృతికి పనిచేయడం లేదు. కంపా ఫండ్స్ఉన్నా స్టాఫ్ కొరత కారణంగా వాటిని వినియోగించుకునే అవకాశం లేకుండా పోతున్నట్లు సమాచారం. కొన్నిసార్లు నిధులు భారీగా ఖర్చవుతున్నాయి. క్విక్ రెస్సాన్స్టీంలు పనిచేస్తున్నా మంటలు విస్తరించకుండా నిరోధించలేకపోతున్నారు. గత ఏడాది మార్చి నెలలో అప్పాపూర్, దోమలపెంట, వటవర్లపల్లి, తుర్కలపల్లి, మన్ననూర్, మల్లాపూర్, తాడుతారా, తుర్కలపల్లి ప్రాంతాలతో పాటు కొత్తగా కొల్లాపూర్అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగి చెట్లు తగలబడిపోయాయి.
తగలబడిన 2,282 హెక్టార్లు
ఒక్క నెలలోనే 44 ఎకరాల అడవి తగలబడినట్లు గుర్తించారు. ఇప్పటివరకు ఈ ఏడాది దాదాపు 2,282 హెక్టార్ల అడవి కాలిపోయినట్లు జీపీఎస్ ద్వారా గుర్తించారు. వేసవిలో వన్యప్రాణులకు తాగునీటి కష్టాలతో పాటు మంటల నుంచి రక్షించుకోవడం పెద్ద సమస్యగా మారుతోంది. ప్రస్తుతం ఉన్న ఫారెస్ట్ యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేసినా ఫీల్డ్ స్టాఫ్, ఫైర్ఫైటింగ్ఎక్విప్మెంట్స్ కొరతతో ఇబ్బందులు తప్పేలా లేవు. ఇక లోయలున్న ప్రాంతాల్లోకి వెళ్లి మంటలను అర్పడం సవాల్‌గా మారుతోంది.