డిజిటల్ అక్షరాస్యతలోనూ గ్రామీణ మహిళలు అవగాహన పెంచుకుంటున్నారని వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలు, నివేదికల గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా విద్య, ఉపాధి, ఆరోగ్య సంరక్షణలో గ్రామీణ మహిళల కంటే పట్టణ మహిళలు మెరుగైన అవకాశాలను పొందుతున్నారు.
భారతదేశంలోని పట్టణ, గ్రామీణ జనాభా మధ్య సామాజిక దూరం విస్తృతం అవడంతో గ్రామీణ మహిళలు సాంకేతికపరమైన అవాంతరాలను ఎదుర్కొంటున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఇంటర్నెట్‌ను ఉపయోగించే స్త్రీలు (25 శాతం) కంటే పురుషులు (49 శాతం) దాదాపుగా రెండింతలు ఎక్కువ ఉన్నారు. పట్టణ,- గ్రామీణ మధ్య అంతరం, గ్రామీణ పురుషులు – మహిళల మధ్య విద్యాపరంగా అంతరం స్పష్టంగా కనిపిస్తున్నా గతంతో పోలిస్తే గ్రామీణ మహిళల స్థితిగతులు మెరుగయ్యాయని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సర్వేలు చెబుతున్నాయి.
ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ఏజెన్సీ అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి (ఐఎఫ్ఏడి) నివేదిక ప్రకారం స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించేవారిలో పురు షులతో పోలిస్తే 16 శాతం గ్రామీణ మహిళలు తక్కువగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల కంటే పురుషులు రెండు రెట్లు ఎక్కువగా ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడం, ఈ–లెర్నింగ్ లేదా ఆన్‌లైన్‌లో వారి ఆసక్తులను కొనసాగించడం వంటి డిజిటల్ సేవలను చాలామంది గ్రామీణ మహిళలు చేయడం లేదు. గ్రామీణ మహిళలకు వ్యవస్థాపకత పరిస్థితులు అడ్డుగా ఉన్నాయి.
ప్రస్తుతం వీటిని ఎదుర్కొంటూ సరైన సాధనాలు, జ్ఞానంతో సందర్భోచిత సాధికారత కలిగిన వ్యాపార యజమానులుగా మారుతున్నారు. ఇండియన్ మార్కెట్ రీసెర్చ్ బ్యూరోలోని ఓ సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం 2020 – 2022 మధ్య ఇంటర్నెట్ వినియోగంలో అంతరం తగ్గింది. డిజిటల్ అక్షరాస్యత, ఇంటర్నెట్ వినియోగంలో గ్రామీణ మహిళల వృద్ధే దీనికి కారణం.
డిజిటల్ అక్షరాస్యత
రోజువారీ కార్యకలాపాలకు కంప్యూటర్, మొబైల్, ఇంటర్నెట్‌ని ఉపయోగించే సామర్థ్యం, ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం కావడాన్ని డిజిటల్ అక్షరాస్యత అంటాం. విద్యా వార్షిక స్థితి నివేదిక-2023 ప్రకారం డిజిటల్ అక్షరాస్యత కలిగిన స్త్రీల నిష్పత్తి 94.7 శాతం మంది పురుషులతో పోలిస్తే 89.8 శాతంతో తక్కువగా ఉందని అధ్యయనం వెల్లడించింది. గ్రామీణ భారతదేశంలోని స్త్రీలలో కొందరికి డిజిటల్ పరిజ్ఞానం లేకపోవడం, డిజిటల్ పరికరాలను ఎలా ఉపయోగించాలో తెలియక పోవడమే దీనికి కారణం. తగినంత డిజిటల్ నైపుణ్యాలు లేని మహిళలు ముఖ్యంగా ఉపాధి రంగాల్లో అడ్డంకులను ఎదుర్కొంటారు. వ్యక్తిగత, సామాజిక, పని వాతావరణాలను మెరుగుపరచడానికి, డిజిటల్ అంతరాన్ని తగ్గించడానికి, సమాజంలో పౌరులను ఏకీకృతం చేయడానికి డిజిటల్ అక్షరాస్యత కీలకమైనది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన భావనలు డిజిటల్ టెక్నాలజీ చుట్టూ ఆధిపత్యం చెలాయిస్తున్నది. విచారకరమైన వాస్తవం ఏమిటంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలోనూ పేద గ్రామీణ మహిళలు వెనుకబడి ఉన్నారు. మొబైల్ ఫోన్‌ను పురుషుల కంటే ఏడు శాతం తక్కువ మంది గ్రామీణ మహిళలు ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ, గత దశాబ్ద కాలంగా భారతదేశం వివిధ సాంకేతిక ఆధారిత రంగాలలో అద్భుతమైన పురోగతిని సాధిస్తోంది. నిరక్షరాస్యులు కూడా యూపీఐ చెల్లింపులు చేయగలుగుతున్నారు.
డిజిటల్ నైపుణ్యంతో వ్యాపార రంగంలో రాణింపు
డిజిటల్ నైపుణ్యంతో మహిళలు ఎలా రాణిస్తున్నారో కొన్ని ఉదాహరణలతో పరిశీలిద్దాం.. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని మారుమూల గ్రామాలకు చెందిన మహిళలు డిజిటల్ పరివర్తనతో వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. అగర్బత్తి తయారీదారు స్నేహ కన్సే, పాపడ్ తయారీదారు ఆశా భుజడే ఉదాహరణగా నిలుస్తున్నారు.
గ్రామీణ భారతదేశాన్ని పునర్నిర్మించే దిశలో గ్రామీణ నానో మహిళా పారిశ్రామికవేత్తలు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. పరిమిత అక్షరాస్యత నైపుణ్యాలు కలిగిన మహిళలు కూడా డిజిటల్, ఫైనాన్షియల్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ స్కిల్స్‌పై శిక్షణ పొందుతూ వారి వ్యాపార స్థాయిని పెంచుకుంటున్నారు. డిజిటల్ నైపుణ్యాల ప్రభావానికి నిదర్శనంగా మారుతున్నారు. సామాజిక వాణిజ్యానికి ఆధారితంగా డిజిటల్ పరివర్తన నిలుస్తోంది.
నాస్కామ్ ఫౌండేషన్ సర్వే ప్రకారం స్నేహ, ఆశా వంటి చాలా మంది గ్రామీణ మహిళలు డిజిటల్ నైపుణ్యం పెంచుకొని ఆన్‌లైన్ వ్యాపారంలో రాణిస్తున్నారు. 71.2 శాతం మంది ఇప్పుడు డిజిటల్ చెల్లింపు పద్ధతులను చురుకుగా అవలంబిస్తున్నారు. ఇది వారి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తోంది. వివిధ డిజిటల్ చెల్లింపు గేట్‌వే, లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లతో వినియోగదారులను కలుస్తున్నారు. ఇప్పుడు గ్రామీణ మహిళలూ డిజిటల్ అక్షరాస్యతపై దృష్టి సారిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌లను సమర్థవంతంగా ఉపయోగించుకొని ఆన్‌లైన్‌లో ఆర్థిక నిర్వహణకు, లావాదేవీలతో వారి కుటుంబాలకు సహాయం చేస్తున్నారు. డిజిటల్, వ్యవస్థాపక, ఆర్థిక అక్షరాస్యత సంక్లిష్టతలను గ్రామీణ మహిళలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. వ్యూహాత్మక, సూచనల దిశను నిర్దేశిస్తున్నారు. సామాజికంగా సాధికారత కలిగిన మహిళలుగా ఎదుగుతున్నారు.
ఇంటర్నెట్ సదుపాయాన్ని పెంచడం
మహిళలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని పెంచడం అనేది ప్రభుత్వ ప్రాధాన్యత. జి-20 ఎజెండా 2030 లక్ష్యం ఏమిటంటే దేశంలో డిజిటల్ వినియోగంలో స్త్రీ, పురుష అంతరాన్ని తగ్గించడం. భారతదేశ డిజిటల్ ఎకానమీ 2024 నివేదిక ప్రకారం అత్యధికంగా గోవాలో 63 శాతం, అత్యల్పంగా బిహార్‌లో 24 శాతం గ్రామీణ మహిళలు డిజిటల్ వినియోగం చేస్తున్నారు.
గోవా, కేరళ, సిక్కిం రాష్ట్రాల్లో మాత్రమే గ్రామీణ మహిళలు 50 శాతం కంటే ఎక్కువ సమయం ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో 30 శాతం మహిళలు ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. దీనిలో గ్రామీణ మహిళల వాటా 12 శాతం మాత్రమే. 2015లో డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. గుర్తింపు పత్రాలు, డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో నిల్వ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ సదుపాయం విస్తృతంగా గ్రామీణ మహిళలకు లేకపోవడంతో ఇటువంటి సేవలను కోల్పోతున్నారు. మొత్తం మీద, గ్రామీణ మహిళలకు ఇంటర్నెట్ వినియోగ ప్రవేశం ఇప్పటికీ తక్కువగానే ఉంది.
ఇంటర్నెట్ సాథీ
గూగుల్ సహకారంతో 2015లో టాటా ట్రస్ట్ 'ఇంటర్నెట్ సాథీ' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. గ్రామీణ వర్గాలలో డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడంలో ఇంటర్నెట్ సాథీలు నాయకత్వం వహిస్తున్నారు. ఏజెంట్‌లుగా పనిచేస్తున్నారు. మహిళలకు శిక్షణ ఇచ్చే గ్రామీణ కమ్యూనిటీలలో డిజిటల్- శిక్షణ పొందిన మహిళల కేడర్‌ను రూపొందించడానికి ఈ ప్రోగ్రామ్ సహాయపడుతోంది.
గ్రామీణ పౌరులకు డిజిటల్ అక్షరాస్యతను అందించే శిక్షకుల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తోంది. టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు 60,000 మంది సాథీలతో బలమైన నెట్‌వర్క్‌ను నిర్మించారు. వీరు రెండు లక్షల గ్రామాల్లో రెండు కోట్లకు పైగా మహిళలకు డిజిటల్ అక్షరాస్యతను అందించారు. వరదలు, తుపానులు వంటి విపత్తుల సమయంలో వాతావరణ సమాచారం, సహాయక చర్యలు వంటి క్లిష్టమైన సమాచారాన్ని కూడా సాథీలు తోటి గ్రామస్తులతో పంచుకుంటారు. కమ్యూనిటీలలో ఇంటర్నెట్ వినియోగ విధానాల గురించి ట్రస్ట్‌లకు సమాచారాన్ని అందించడంలో సాథీలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఔత్సహిక డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్‌లో ఫీడ్ చేసే క్షేత్ర స్థాయి డేటాను ఇంటర్నెట్ సాథీలు సేకరిస్తున్నారు.
- డా. సునీల్ కుమార్ పోతన,జర్నలిస్ట్–