- కేటీఆర్ సన్నిహితులమంటూ పోటాపోటీ కార్యక్రమాలు
- ఈ సారి తమకే నంటూ ప్రచారం
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సొంత పార్టీ లీడర్ల నుంచి ఇంటి పోరు ఎక్కువవుతోంది. జిల్లాలో ఆదిలాబాద్ నుంచి జోగు రామన్న, బోథ్ నుంచి రాథోడ్ బాపూరావు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఈ సారి ఎలక్షన్లకు ఇంకా ఆరు నెలల సమయం ఉండగానే ఎమ్మెల్యే టికెట్ల కోసం ఆశావహులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యేలకు పోటీగా ఆయా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేస్తున్నారు. వర్గ విభేదాలు.. మరో పక్క బీఆర్ఎస్ సెకండ్ క్యాడర్ లీడర్ల భూ కబ్జాల ఆరోపణలతో పార్టీ పై ప్రజల్లో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలు బలం పెంచుకునే పని లో ఉండగా.. అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం సొంత పార్టీ నేతల వర్గపోరుతో తలలు పట్టుకుంటున్నారు.
ఆదిలాబాద్ లో అంతే..
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న కు సైతం సొంత లీడర్ల నుంచి వర్గ పోరు తప్పడం లేదు. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ రంగినేని మనీషా మంత్రి కేటీఆర్ కు సన్నిహితురాలనే ప్రచారం ఉంది.ఇటీవల ఎమ్మెల్యేని కాదని ఆమె సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు బీఆర్ఎస్ లో మొదటి నుంచి ఉన్న లీడర్లను పక్కనబెట్టడంతో సీనియర్లు కూడా ఎమ్మెల్యేకు దూరంగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కొంత మంది కౌన్సిలర్లు, పార్టీ లీడర్ల భూకబ్జాల ఆరోపణలు కూడా ప్రభావం చూపుతాయనే చర్చ జరుగుతోంది. అక్రమ లే అవుట్లు, వెంచర్లలో బీఆర్ఎస్ లీడర్ల పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. మరో పక్క అధికార దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఇటీవల మున్సిపల్ వైస్ చైర్మన్ బీజేపీ నేతను మున్సిపల్ ఆఫీస్ కు రావద్దంటూ బెదిరించడం.. అధికారుల మీద అజమాయిషీ చెలాయిస్తున్న వీడియో వైరల్ కావడం కలకలం రేపింది. దీంతో పాటు డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో కొంత మంది కౌన్సిలర్లు లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
పలువురు కౌన్సిలర్లు సైతం ఎమ్మెల్యే జోగు రామన్నను కాదని సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
బోథ్ బీఆర్ఎస్ లో రాజకీయ వేడి..
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు సొంత పార్టీలోని వ్యతిరేక వర్గంతో తలనొప్పిగా మారింది. కొంత కాలంగా బహిరంగంగా విమర్శలు చేస్తున్న నేతలు ఏకంగా ఎమ్మెల్యే సీటుకే ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది. రోజూ బోథ్ బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ టికెట్ పై తీవ్ర చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే బాపురావు మాత్రం తనకే టికెట్ వస్తుందని.. మరో సారి గెలవబోతున్నట్లు వివిధ కార్యక్రమాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో ఆయన పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బాపురావుకు టికెట్ వస్తుందా లేదా అనే టెన్షన్ ఆయన వర్గంలో కనిపిస్తోంది. బోథ్ నియోజకవర్గంలో మాజీ ఎంపీ గోడం నగేష్ తో పాటు నేరడిగొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్ బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అనిల్ జాదవ్ మంత్రి కేటీఆర్ తో సన్నిహితంగా ఉంటూ టికెట్ ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవల ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ప్రారంభానికి కేటీఆర్ తో కలిసి అనిల్ జాదవ్ స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లడం ఈ చర్చకు దారి తీసింది. అటు మాజీ ఎంపీ గోడం నగేష్ కూడా కేటీఆర్ తో సన్నిహితంగా ఉండటంతో ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ వస్తుందోనని కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు.