భద్రాచలం వద్ద 43 అడుగులకు  చేరుకున్న గోదావరి..రెడ్ అలెర్ట్

  • బంగాళాఖాతంలో అల్పపీడనం పొంగుతున్న ఉపనదులు
  • 55 అడుగుల వరకు చేరే అవకాశం 
  • రెడ్​అలర్ట్ ప్రకటించిన కలెక్టర్​ ఉద్యోగుల సెలవులు రద్దు


భద్రాచలం, వెలుగు : భద్రాచలం వద్ద గోదావరి మంగళవారం సాయంత్రం 4 గంటలకు 43 అడుగులకు చేరుకుంది. దీంతో కలెక్టర్​ అనుదీప్​ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఉపరితల ఆవర్తనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువన ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, దిగువన ఉన్న కిన్నెరసాని, సీలేరు, శబరి ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో కలెక్టర్​ అనుదీప్​ జిల్లాలో రెడ్​ అలర్ట్ ప్రకటించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాలకు సెక్టోరియల్​ఆఫీసర్లు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

అధికారులకు సెలవులు రద్దు చేశారు. భద్రాచలంలోని సబ్​ కలెక్టర్​ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కరకట్టపై ఉన్న స్లూయిజ్​మూసివేసిన కారణంగా భద్రాచలం టౌన్​లోని డ్రైన్​ బ్యాక్​ వాటర్​ విస్తా కాంప్లెక్స్ వద్దకు చేరుకోవడంతో మోటార్లతో ఎత్తి గోదాట్లో పోస్తున్నారు. లోతట్టు ఏరియాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాటు పడవలపై వాగులు, ఉపనదులు, నదుల్లో ప్రయాణాలను నిషేధించారు. భద్రాచలంలో స్నానఘట్టాల వద్ద  గజ ఈతగాళ్లను రెడీగా ఉంచారు. ఇంజిన్ ​బోట్లను కూడా రెడీ చేశారు. బుధవారం మధ్యాహ్నానికి భద్రాచలం వద్ద గోదావరి 55 అడుగులకు చేరుకుంటుందని కలెక్టర్​ ప్రకటించిన నేపథ్యంలో ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. 

రామన్నగూడెం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

ఏటూరునాగారం : వర్షాలకు తోడు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కర ఘాట్​వద్ద గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు నీటిమట్టం 14. 830 మీటర్లు దాటడంతో ఆఫీసర్లు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రం ఆరు గంటలకు 15.410 మీటర్లకు చేరింది. కాగా 15.830 మీటర్లకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.  వరద తీవ్రత మరింత పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.