NZ vs SL: బౌండరీ దగ్గర కళ్లుచెదిరే విన్యాసం.. క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ క్యాచ్

హామిల్టన్ వేదికగా బుధవారం(జనవరి 8) శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ క్రికెటర్ నాథన్ స్మిత్ సంచలన క్యాచ్ తో మెరిశాడు. బౌండరీ దగ్గర విన్యాసం చేస్తూ ఊహకందని క్యాచ్ తో ఆశ్చర్యానికి గురి చేశాడు. 256 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక ఓటమి దిశగా పయనిస్తోంది. విలియం ఒరోర్కే వేసిన బంతిని శ్రీలంక ఆటగాడు ఇషా మలింగ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. టైమింగ్ కుదరక బంతి థర్డ్ మ్యాన్ దిశగా వెళ్ళింది. బౌండరీ ఖాయమన్న దశలో నాథన్ స్మిత్ శరవేగంగా వచ్చి బంతిని అందుకున్నాడు. 

థర్డ్ మ్యాన్ కు దూరంగా ఉన్న ఈ కివీస్ క్రికెటర్ క్యాచ్ కోసం చాలా దూరం పరిగెత్తి ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి పట్టుకున్నాడు. రెప్పపాటులో జరిగిన ఈ సంఘటన క్రికెట్ అభిమానులను షాక్ కు గురి చేసింది. క్రికెట్ చరిత్రలోనే ఇది బెస్ట్ క్యాచ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వర్షం కారణంగా 37 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 37 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఓపెనర్ రచీన్ రవీంద్ర (79), చాప్ మన్ (62) హాఫ్ సెంచరీలతో రాణించారు. 

ALSO READ | Vijay Hazare Trophy: ఫామ్‌లో ఉన్నా పక్కన పెట్టారు.. విజయ్ హజారే ట్రోఫీలో చాహల్‌పై వేటు

భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక 142 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తో వన్డే సిరీస్ గెలుచుకుంది. ఇదే మ్యాచ్ లో శ్రీలంక స్పిన్నర్ మతీశ తీక్షణ హ్యాట్రిక్ తో చెలరేగాడు. కివీస్ ఇన్నింగ్స్ 35 ఓవర్లో చివరి రెండు బంతులకు సాంట్నర్, నాథన్ స్మిత్ వికెట్లు తీసుకున్న లంక స్పిన్నర్ 37 ఓవర్ తొలి బంతికి హెన్రీని ఔట్ చేశాడు. దీంతో వన్డే ఫార్మాట్ లో హ్యాట్రిక్ తీసుకున్న ఏడో శ్రీలంక ఆటగాడిగా తీక్షణ రికార్డ్ పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు.