- రాణించిన బ్యాటర్లు
- 157 రన్స్ లీడ్‌లో టీమిండియా
ముంబై : ఆస్ట్రేలియాతో ఏకైక టెస్ట్‌లో ఇండియా విమెన్స్ టీమ్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. ఓపెనర్ స్మృతి మంధాన (106 బాల్స్‌లో 12 ఫోర్లతో 74), జెమీమా రొడ్రిగ్స్ (121 బాల్స్‌లో 9 ఫోర్లతో 73), దీప్తి శర్మ (147 బాల్స్‌లో 9 ఫోర్లతో 70 బ్యాటింగ్) ఫిఫ్టీలతో రాణించడంతో.. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 119 ఓవర్లలో 376/7 స్కోరు చేసింది. దీప్తితో పాటు పూజా వస్త్రాకర్ (33 బ్యాటింగ్) క్రీజులో ఉంది. ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ ఆష్లీ గార్డ్‌నర్ 4 వికెట్లు తీసింది. ప్రస్తుతం ఇండియా 157 రన్స్ ఆధిక్యంలో ఉంది.
రాణించిన మంధాన
ఇండియా 98/1 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించింది. మంధాన నిలకడగా ఆడినా.. స్నేహ్ రాణా (9) విఫలమైంది. తొలి సెషన్‌లో తొలి గంటలో ఎక్కువసేపు బ్యాటింగ్ చేసిన మంధాన 68 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసింది. 35వ ఓవర్‌లో స్నేహ్ రాణా ఔట్ కావడంతో రెండో వికెట్‌కు 50 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. తర్వాత రిచా ఘోష్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను మంధాన ముందుకు తీసుకెళ్లింది. ఓ క్యాచ్ ఔట్ నుంచి బయటపడినా 39వ ఓవర్‌లో అనూహ్యంగా రనౌటైంది. బ్యాక్‌వర్డ్ పాయింట్‌లోకి బాల్‌ను పంపి మంధాన సింగిల్ కోసం పరుగెత్తినా.. నాన్ స్ట్రయికర్ రిచా స్పందించలేదు. మంధాన తిరిగి క్రీజులోకి చేరుకునేలోపే గార్త్ వికెట్లను పడగొట్టింది. ఇక్కడి నుంచి జెమీమా, రిచా అద్భుతంగా ఆడారు. ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీశారు. అదే టైమ్‌లో చెత్త బాల్స్‌ను బౌండ్రీలకు పంపి రన్‌రేట్‌ను పెంచారు. ఈ క్రమంలో జెమీమా 86, రిచా 98 బాల్స్‌లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు.
14 రన్స్‌కే 4 వికెట్లు..
నిలకడగా సాగుతున్న ఇండియా ఇన్నింగ్స్‌కు రెండో సెషన్ చివర్లో గార్డ్‌నర్ బ్రేక్‌లు వేసింది. స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు తీసి స్కోరును కట్టడి చేసింది. 70వ ఓవర్‌లో రిచాను కిమ్ గార్త్ (1/49) ఔట్ చేయడంతో నాలుగో వికెట్‌కు 113 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. తర్వాత వరుస విరామాల్లో గార్డ్‌నర్.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (0), యస్తికా భాటియా (1), జెమీమాను పెవిలియన్‌కు పంపింది. ఓవరాల్‌గా 8.5 ఓవర్లలో 14 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోవడంతో ఇండియా స్కోరు 274/7గా మారింది. ఈ దశలో వచ్చిన దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. ఎనిమిది మంది బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ నిలకడగా రన్స్ సాధించారు. 115 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన దీప్తి ఎనిమిదో వికెట్‌కు 102 రన్స్ జత చేసి మరో వికెట్ పడకుండా రోజును ముగించింది.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 219 ఆలౌట్. ఇండియా తొలి
- ఇన్నింగ్స్ : 119 ఓవర్లలో 376/7 (మంధాన 74, జెమీమా 73, దీప్తి శర్మ 70*, రిచా ఘోష్ 52, గార్డ్‌నర్ 4/100).