నేటి (జనవరి 11) నుంచి భారత్, అఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. గురువారం మొహాలీ వేదికగా వణుకుపుట్టే చలిలో ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది. ఈ క్రమంలో భారతక్రికెటర్లకు మాజీలు హెచ్చరికలు చేశారు. రికార్డుల పరంగా అఫ్గానిస్థాన్‌పై ఆధిపత్యం ఉన్నా.. వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒక్క ఓవర్‌తో మ్యాచ్ ఫలితమే మారిపోయే పొట్టి ఫార్మాట్‌లో అలసత్వం వద్దని సూచిస్తున్నారు.
అన్నింటా విజయాలే..
అఫ్ఘన్లు.. భారత్‌పై గెలిచే అవకాశం లేకపోయినా భయపెట్టగలరు. ఇప్పటివరకూ ఈ ఇరు జట్లు 5 టీ20ల్లో తలపడగా.. నాలుగింట టీమిండియా విజయం సాధించింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. కానీ ఈసారి అఫ్ఘన్లు అంత తేలిగ్గా ఓటమిని అంగీకరించకపోవచ్చు. గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో ఆ జట్టు సంచలన ప్రదర్శన చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ సహా మాజీ ఛాంపియన్లు పాకిస్థాన్, శ్రీలంకను మట్టికరిపించింది. ఆ గెలుపులు కూడా గాలివాటం కాదు. పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి సాధించిన విజయాలు. అందునా పొట్టి ఫార్మాట్లో ఆ జట్టు మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో అతి విశ్వాసానికి పోకుండా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉందన్నది మాజీల సూచన.
భారత్, అఫ్ఘనిస్తాన్ హెడ్ to హెడ్ రికార్డ్స్
వన్డేలు (4 మ్యాచ్‌లు): ఇండియా -3; అఫ్ఘనిస్తాన్ - 0; టై - 1
టీ20లు (5 మ్యాచ్‌లు): ఇండియా -4; అఫ్ఘనిస్తాన్ - 0; ఫలితం తేలనిది -1
జట్ల అంచనా
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, గిల్, తిలక్‌వర్మ, సంజూ శాంసన్, రింకూసింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అవేశ్‌ఖాన్, అర్ష్‌దీప్‌సింగ్, ముకేశ్‌కుమార్.
అఫ్గనిస్థాన్: హజ్రతుల్లా జజాయ్, రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్), ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, నబీ, కరీమ్ జనత్, ముజీబుర్ రెహమాన్, ఖాయిస్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, ఫారుఖీ.