దుబాయ్: ఆసియా కప్ అండర్–19 టోర్నీలో ఇండియా కుర్రాళ్లు బోణీ చేశారు. అర్షిణ్ కులకర్ణి (70 నాటౌట్, 3/29) ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకోవడంతో శుక్రవారం జరిగిన గ్రూప్–ఎ తొలి మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్ అండర్–19 టీమ్‌పై నెగ్గింది. దీంతో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుంది.
టాస్ ఓడిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 173 రన్స్‌కు ఆలౌటైంది. జంషీద్ జద్రాన్ (43) టాప్ స్కోరర్. మహ్మద్ యూనస్ (26), నుమాన్ షా (25), మహ్మద్‌జాయ్ (20) ఫర్వాలేదనిపించారు. ఇండియా బౌలర్లలో అర్షిణ్తో పాటు రాజ్ లింబానీ 3, నమన్ తివారీ 2 వికెట్లు తీశాడు.
తర్వాత ఛేజింగ్‌లో ఇండియా 37.3 ఓవర్లలో 174/3 స్కోరు చేసి నెగ్గింది. ఆదర్శ్ సింగ్ (14), రుద్ర పటేల్ (5), ఉదయ్ శరణ్ (20) నిరాశ పరిచినా.. అర్షిణ్, ముషీర్ (48 నాటౌట్) నాలుగో వికెట్‌కు 98 రన్స్ జోడించి ఈజీగా గెలిపించారు. మరో మ్యాచ్‌లో పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో నేపాల్‌పై నెగ్గింది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఇండియా.. పాక్‌తో తలపడుతుంది.