IND vs  AFG: మాటలన్నారు.. ఫలితం అనుభవించారు: ఆఫ్ఘన్‌పై రోహిత్ సేన ఘన విజయం

IND vs  AFG: మాటలన్నారు.. ఫలితం అనుభవించారు: ఆఫ్ఘన్‌పై రోహిత్ సేన ఘన విజయం

అసలు సిసలు దాయాదుల పోరుకు ముందు భారత జట్టు మంచి విజయాన్ని అందుకుంది.  భారత్ కంటే తమ జట్టులోని నాణ్యమైన స్పిన్నలరు ఉన్నారంటుగా ఆ జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిది చేసిన వ్యాఖ్యలకు గుణపాఠం నేర్పారు. ఢిల్లీ వేదికగా ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఫ్ఘన్ బ్యాటర్లు నిర్ధేశించిన 273 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 15 ఓవర్లు మిగిలివుండగానే చేదించింది.

రోహిత్ vs ఆఫ్ఘన్ బౌలర్లు

ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వీర విహారం చేశాడు. శతకం బాదిన రోహిత్.. ఈ ఒక్క సెంచరీతో పలు అంతర్జాతీయ రికార్డులు బద్దలు కొట్టాడు. 63 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్న రోహిత్.. వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యంత వేగంగా శతకం బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్(72 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. అలాగే, 7 సెంచరీలతో వన్డే ప్రపంచ కప్‌లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. గత మ్యాచ్ వరకూ ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్(6) పేరిట ఉండేది.

రాణించిన హస్మతుల్లా, ఒమర్జాయ్‌

తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. హష్మతుల్లా షాహిది (80), అజ్మతుల్లా ఒమర్జాయ్‌(62) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు.. ఆఫ్ఘన్ బౌలర్లకు ఏ చిన్న అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా రోహిత్ శర్మ కొట్టుడుకు పవర్ ప్లే ముగిసేసరికే వారు అలిసిపోయారు. మొత్తంగా 84 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. 16 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 131 పరుగులు చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ(55) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. , ఇషాన్ కిషన్ 47 పరుగుల వద్ద ఔటై పెవిలియన్ చేరాడు.