జనవరి 11 నుంచి స్వదేశంలో అఫ్ఘానిస్థాన్‌తో టీ20 సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ పర్యటన కోసం అఫ్ఘన్ బోర్డు ఇప్పటికే జట్టును ప్రకటించగా.. బీసీసీఐ మాత్రం ఇంకా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తూనే ఉంది. అందుకు ప్రధాన కారణం.. టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు ఆడనున్న చివరి టీ20 సిరీస్ ఇదే. అందునా భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు పొట్టి ఫార్మాట్‌లో కొనసాగే విషయంపై స్పష్టత రావడం లేదు. దీంతో ఈ జట్టులో ఎవరెవరికి చోటు దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
రోహిత్, కోహ్లీలు.. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉండగానే బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ బృందం వారితో చర్చించింది. ఈ సమావేశంలో వీరిద్దరూ టీ20ల్లో కొనసాగేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలియచేసినట్లు సమాచారం. ఇది జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా భారత జట్టు ఎంపిక ఒక కొలిక్కి రావడం లేదు. రోహిత్, కోహ్లీలను ఎంపిక చేస్తే.. యువ ఆటగాళ్ల పరిస్థితి ఏంటనేది ఇక్కడ ఎదురవుతోన్న ప్రశ్న. ఈ విషయంపై అగార్కర్.. బీసీసీఐ పెద్దలు రోజర్ బిన్నీ, జై షాతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారని నివేదికలు చెప్తున్నాయి. అందునా బీసీసీఐ కార్యదర్శి జై షా చర్చించాకే జట్టు ప్రకటన రానుందనే ప్రచారం జరుగుతోంది. రోహిత్, కోహ్లీలను కొనసాగించాలా.. ? వద్దా..? అనేది జై షా చేతుల్లో ఉందన్నది విశ్లేషకుల మాట.
జట్టు ప్రకటన ఎప్పుడు..?
ఆదివారం సాయంత్రం లేదా సోమవారం జట్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తుది జట్టులో రోహిత్, కోహ్లి ఇద్దరికీ చోటు కల్పిస్తే బ్యాలెన్స్ సమస్య తలెత్తే అవకాశం లేకపోలేదు. తొలి నాలుగు స్థానాలకు రోహిత్, శుభ్‌మన్ గిల్, విరాట్, సూర్యలను కొనసాగిస్తే.. లెఫ్ట్ - రైట్ కాంబినేషన్ ఉండదు. అప్పుడు వీరిలో ఒకరిని తుది జట్టు నుంచి తప్పించి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కు అవకాశమివ్వాలి. ఇదే బీసీసీఐకి తలనొప్పిగా మారుతోంది. రోహిత్, కోహ్లీ ఇద్దరిలో ఒకరిని ఆడించి.. మరొకరిని పక్కన పెట్టే పరిస్థితి లేదు. ఆడితే ఇద్దరినీ ఆడించాలి లేదంటే ఇద్దరినీ పక్కన పెట్టాలి. దీంతో జట్టు నుంచి ఎవరిని తప్పించాలో అర్థమవ్వని పరిస్థితి. దీంతో సెలక్టర్ల నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
టీ20 సిరీస్ షెడ్యూల్
- తొలి టీ20 (జనవరి 11): మొహాలీ
- రెండో టీ20 (జనవరి 14): ఇండోర్
- మూడో టీ20 (జనవరి 17): బెంగళూరు
మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి.