IND vs AFG: రాణించిన సూర్య, పాండ్యా.. అఫ్ఘన్ల ఎదుట భారీ లక్ష్యం

IND vs AFG: రాణించిన సూర్య, పాండ్యా.. అఫ్ఘన్ల ఎదుట భారీ లక్ష్యం

క‌రీబియ‌న్ గ‌డ్డపై భారత బ్యాటర్లు దుమ్మురేపారు. సరైన మ్యాచ్‌లో బ్యాట్ ఝుళిపించి ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపారు. సూపర్-8లో భాగంగా అఫ్గాన్‌ తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్(53; 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్ గా నిలవగా.. హార్దిక్ పాండ్యా(32), విరాట్ కోహ్లీ(24), రిషబ్ పంత్(20) పర్వాలేదనిపించారు.

రోహిత్ తడబాటు

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(8) స్వల్ప స్కోర్‌కే ఔట‌య్యాడు. దాంతో, 11 ప‌రుగుల వ‌ద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఫ‌జ‌ల్హక్ ఫారూఖీ వేసిన రెండో ఓవ‌ర్లో తొలి బంతికి ఎల్బీ నుండి బ‌తికిపోయిన రోహిత్.. అదే ఓవర్ ఐదో బంతికి రషీద్‌ ఖాన్‌ చేతికి చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషభ్‌ పంత్ (11 బంతుల్లో 20; 4 ఫోర్లు) కాసేపు ధాటిగా ఆడాడు. న‌బీ వేసిన ఆరో ఓవ‌ర్లో పంత్ ఏకంగా హ్యాట్రిక్ బౌండ‌రీలు బాదాడు. దాంతో, ప‌వ‌ర్ ప్లేలో వికెట్ న‌ష్టానికి 47 పరుగులు చేసింది.

ఆదుకున్న సూర్య, పాండ్యా

విరాట్- రిషబ్ జోడి కుదురుకున్నారన్న సమయాన రషీద్ దెబ్బకొట్టాడు. కోహ్లీ (24)ని వెనక్కి పంపాడు. అనంతరం సూర్యకుమార్ యాదవ్ (53), శివమ్ దూబె (10) ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 17 పరుగులు జోడించారు. దూబె ఔటయ్యాక హార్దిక్ పాండ్యా(32; 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. చివరలో సూర్య, పాండ్యా ఔట్ అవ్వడంతో స్కోర్ కాస్త తగ్గింది. నవీన్-ఉల్-హక్ వేసిన ఆఖరి ఓవర్‌లో అక్సర్ పటేల్ 14 పరుగులు రాబట్టి మంచి ఫినిషింగ్ ఇచ్చాడు.

ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఫజల్హక్ ఫారూఖీ మూడేసి వికెట్లు పడగొట్టారు.