IND vs AUS: దంచికొట్టిన సూరీడు.. వరల్డ్ కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న భారత్

IND vs AUS: దంచికొట్టిన సూరీడు.. వరల్డ్ కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న భారత్

వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి భారత యువ కెరటాలు ప్రతీకారం తీర్చుకున్నారు. గురువారం వైజాగ్‌ వేదికగా జ‌రిగిన తొలి టీ20లో  భారత జట్టు 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 208 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో భారత బ్యాటర్లు మరో బంతి మిగిలివుండగానే లక్ష్యాన్ని చేధించారు. ఇషాన్ కిషన్(58; 39 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులు), సూర్యకుమార్ యాదవ్(80; 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులు) రాణించారు.    

209 పరుగుల భారీ ఛేదనలో భారత జట్టు ఆమంచి ఆరంభం లభించలేదు. తొలి ఓవర్‍లోనే వైస్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(0) డైమండ్ డక్‌గా పెవిలియన్ చేరాడు. ఆపై కొద్దిసేపటికే  భారీ షాట్ల‌తో క‌నిపించిన య‌శ‌స్వీ జైస్వాల్(21) స్మిత్‌కు సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో ఇషాన్ కిషన్- సూర్య జోడి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

అనంతరం ధాటిగా ఆడే ప్రయత్నంలో కిషన్(58; 39 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులు) వెనుదిరగగా.. క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ (12; 10 బంతుల్లో 2 ఫోర్లు) దూకుడుగా ఆడలేకపోయాడు. మరో ఎండ్‌లో సూర్య(80) మాత్రం రిక్వైర్డ్ రన్‌రేట్ అదుపులో ఉండేలా తన దూకుడు కొనసాగించాడు. ఆఖరిలో అతను ఔటైనా..  రింకూ సింగ్(22 నాటౌట్; 14 బంతుల్లో 2 ఫోర్లు) జట్టును విజయతీరాలకు చేర్చాడు.

జోష్ ఇంగ్లిస్‌ సెంచరీ

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. జోష్ ఇగ్నిస్(110; 50 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సులు) మెరుపు సెంచరీ చేయగా.. స్టీవ్ స్మిత్(52; 41 బంతుల్లో 8 ఫోర్లు) అర్ధ శతకం బాదాడు.