ఇండోర్: వన్డే వరల్డ్ కప్‌కు ముందు టీమిండియా యంగ్‌స్టర్స్‌కు చివరి చాన్స్. సీనియర్ల గైర్హాజరీలో తొలి మ్యాచ్‌లో చెలరేగిన కుర్రాళ్లందరూ ఇప్పుడు ఆస్ట్రేలియాపై సిరీస్ నెగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే రెండో వన్డేలో ఇండియా.. ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే మెగా ఈవెంట్ టీమ్‌కు ఎంపికైన శ్రేయస్ అయ్యర్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంది.
ఆసియా కప్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన అతను కంగారూలపై కూడా ఫెయిలయ్యాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లోనూ శ్రేయస్ విఫలమైతే మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. వెటరన్ స్పిన్నర్ అశ్విన్‌కు కూడా ఈ మ్యాచ్ చావో రేవో కానుంది. తొలి వన్డేలో ఫెయిలైన అతను ఈ పోరులో అంచనాలు అందుకుంటాడా? అన్నది ఆసక్తికరం. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను చేజారకుండా చూసుకోవాలని ఆసీస్ కూడా ప్రయత్నాలు చేస్తోంది. స్టార్క్, మ్యాక్స్‌వెల్, హేజిల్‌వుడ్ లేకపోవడం లోటుగా కనిపిస్తున్నది. వీళ్లు మూడో వన్డేకు అందుబాటులోకి రానున్నారు.