IND Vs AUS: తిరువనంత పురంలో భారీ వర్షాలు.. రెండో టీ20 జరగటం కష్టమేనా..?

IND Vs AUS: తిరువనంత పురంలో భారీ వర్షాలు.. రెండో టీ20 జరగటం కష్టమేనా..?

ఆస్ట్రేలియాతో 5టీ 20ల సిరీస్ లో భాగంగా వైజాగ్ లో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారీ లక్ష్య ఛేదనలో ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ రెండు వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఈ నేపథ్యంలో నేడు(నవంబర్ 26) కేరళ వేదికగా రెండో టీ20 మ్యాచ్ కు సిద్ధమవుతుంది. ఈ మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ పై పట్టు బిగించే ప్రయత్నం చేయాలని భారత్ భావిస్తుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం కనిపిస్తుంది. త్రివేండ్రంలో జరగనున్న ఈ మ్యాచ్ కు వర్షం పడుతుందో లేదో ఇప్పుడు చూద్దాం. 

శనివారం ఉదయం ఇక్కడ భారీ వర్షాలు కురిశాయి. పిచ్ మొత్తానికి కవర్లు కప్పినా వర్షం నీళ్లు నిలిచిపోయాయి. రాబోయే 48 గంటల్లో ఇక్కడ కుండపోతగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ రోజు వాతావరం చూసుకుంటే మ్యాచ్ కు పెద్దగా వర్షం గండం లేనట్టుగానే రిపోర్ట్స్ చెబుతున్నాయి.  AccuWeather ప్రకారం, ఉదయం ఎండగా ఉంటుందని.. మధ్యాహ్నం చిరు జల్లులు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.   ఇక సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌పై ఎలాంటి వర్షం కురిసే అవకాశం లేదని స్పష్టం చేసింది . 

ఇటీవల వర్షాలు కురుస్తున్నప్పటికీ మ్యాచ్ రోజు గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్‌ఉంటుందని రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి.  దీంతో ఈ మ్యాచ్ ఎలాంటి వర్షం అంతరాయం లేకుండా సజావుగా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ మ్యాచ్ సమయంలో వర్షం పడితే ఓవర్లు కుదిస్తారు. అప్పటికీ సాధ్యపడకపోతే మ్యాచ్ ను రద్దు చేస్తారు. ప్రస్తుతం భారత్ 5 టీ 20 ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.