సూర్య విధ్వంసం లేదు.. అయ్యర్ మెరుపులు లేవు.. అయినప్పటికీ భారత జట్టు పటిష్ట ఆసీస్‌ను రాయ్‌పూర్ గడ్డపై మట్టి కురిపించింది. ఎలాగంటారా! మొదట భారత యువ బ్యాటర్లు రింకూ సింగ్(46), జితేష్ శర్మ(35) బ్యాటింగ్‌లో రాణించగా.. అనంతరం స్పిన్నర్లు అక్సర్ పటేల్, రవి బిష్ణోయ్ ఆసీస్ వీరులను కట్టడిచేశారు. దీంతో ఓ మోస్తరు లక్ష్యాన్ని భారత్ కాపాడుకోగలిగింది. శుక్రవారం రాయ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలివుండగానే 3-1తేడాతో సొంతం చేసుకుంది.
ట్రావిస్ హెడ్ దూకుడు
175 పరుగుల ఛేదనలో ట్రావిస్ హెడ్.. ఆసీస్‌కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. దీపక్ చాహర్ వేసిన మూడో ఓవర్‌లో ఏకంగా 22 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఆసీస్ మూడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. ఆ సమయంలో రవి బిష్ణోయ్ కంగారూలను దెబ్బకొట్టాడు. 4వ ఓవర్ మొదటి బంతికే జోష్ ఫిలిప్‌ను బిష్ణోయ్ పెవిలియన్ చేర్చగా.. ఆ మరుసటి ఓవర్‌లో అక్సర్ పటేల్.. ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేశాడు. అక్కడినుండి ఆస్ట్రేలియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూనే వచ్చింది.
— CricTracker (@Cricketracker) December 1, 2023
ఆ సమయంలో టిమ్ డేవిడ్(19), బెన్ మెక్‌డెర్మాట్(19) జోడి ఆదుకునే ప్రయత్నం చేసినా రిక్వైర్డ్ రన్ రేట్ అంతకంతకూ పెరిగిపోవడంతో ధాటిగా ఆడే ప్రయత్నంలో వారు వికెట్లు పారేసుకున్నారు. చివరలో మాథ్యూ షార్ట్(22), మాథ్యూ వేడ్(36 నాటౌట్) రాణించడంతో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 154 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అక్సర్ పటేల్ తన నాలుగు ఓవర్లలో 16 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
Back-to-back home series wins for India against Australia in T20Is ? ? pic.twitter.com/31An4Eoxdi
— ESPNcricinfo (@ESPNcricinfo) December 1, 2023
ఆదుకున్న రింకూ సింగ్, జితేష్ శర్మ
అంతకుముందు భారత యువ బ్యాటర్లు రింకూ సింగ్ (29 బంతుల్లో 46 పరుగులు), జితేష్ శర్మ(35; 19 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ లు ఆడడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(37; 28 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్), రుతురాజ్ గైక్వాడ్(32; 28 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్) రాణించారు. సూర్యకుమార్ (1), శ్రేయాస్ అయ్యర్ (8) విఫలమయ్యారు.
ఈ ఇరు జట్ల మధ్య ఐదో టీ20 బెంగళూరు వేదికగా ఆదివారం(డిసెంబర్ 3) జరగనుంది.