IND vs AUS: ముగిసిన తొలిరోజు ఆట.. భారీ స్కోర్ దిశ‌గా ఆస్ట్రేలియా

IND vs AUS: ముగిసిన తొలిరోజు ఆట.. భారీ స్కోర్ దిశ‌గా ఆస్ట్రేలియా

మెల్‌బోర్న్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న బాక్సింగ్ డే టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశ‌గా దూసుకెళ్తోంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 6 వికెట్లు నష్టపోయి 311 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు సామ్ కొంటాస్(60), ఉస్మాన్ ఖవాజా(57), మార్నస్ లబుషేన్(72), స్టీవ్ స్మిత్(68*) నలుగురూ హాఫ్ సెంచరీలు చేశారు. దాంతో, ఆసీస్ పట్టు బిగించినట్లే కనిపిస్తోంది.

కొంటాస్ జోరు.. కోహ్లీ స్లెడ్జింగ్

తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియన్ల ఆధిపత్యాన్ని పక్కనపెడితే.. విరాట్ కోహ్లీ vs సామ్ కొంటాస్ మధ్య జరిగిన గొడవ బాగా వివాదాస్పదమవుతోంది. ఆసీస్ ఆటగాడితో జరిగిన గొడవలో భారత బ్యాటర్‌దే తప్పని అందరూ విమర్శిస్తున్నారు. ఎంతో అనుభవం ఉన్న కోహ్లీ.. 19 ఏళ్ల ఆటగాడితో ప్రవర్తించిన తీరు సరికాదని భారత అభిమానులు మండి పడుతున్నారు. ఈ గొడవ తరువాత ఆసీస్ బ్యాటర్లు మరింత రెచ్చిపోయారనడంలో సందేహం లేదు. 

తొలి మూడు టెస్టుల్లో విఫలమైన ఉస్మాన్ ఖావాజా(57) ఏకంగా హాఫ్ సెంచరీ బాదాడు. మార్నస్ లబుషేన్(72), స్టీవ్ స్మిత్(68*)లు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ పరుగులు రాబట్టారు. భార‌త బౌల‌ర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(3 వికెట్లు) మినహా ఇతర బౌలర్లు రాణించపోవడం ఆసీస్‌కు కలిసొచ్చింది. స్వదేశీ పిచ్‌లపై రెచ్చిపోయే సిరాజ్.. ఆసీస్ పర్యటనలో వికెట్ల ఖాతా తెరవలేకపోతున్నాడు. రెండురోజు ఆట తొలి సెషన్‌లోపు ఆసీస్‌ను ఆలౌట్ చేయకపోతే.. కోలుకోవడం కష్టమే.

ప్రస్తుతం ఐదు టెస్టుల బోర్డర్ గ‌వాస్కర్ సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. పెర్త్ టెస్టులో భారత్.. బ్రిస్బేన్ మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధించగా.. మూడో టెస్ట్ వర్షం కారణంగా డ్రా అయింది.