AUS vs IND: బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఓటమి

AUS vs IND: బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఓటమి

భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. 340 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా155 పరుగులకే కుప్పకూలింది. భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్(84) ఆపద్భాందవుడిలా జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా.. మరో ఎండ్‌ నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు. సీనియర్ల పేలవ ప్రదర్శన.. థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయాలు టీమిండియాను మరింత దెబ్బకొట్టాయి. ఈ విజయంతో ఆసీస్ ఐదు మ్యాచ్ టెస్ట్ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది.

మారని ఆ ఇద్దరి తీరు.. 

బాక్సింగ్‌ డే టెస్టులో భారత సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యారు. ఓ వైపు అదే పిచ్‌లపై జూనియర్లు రాణిస్తున్నా.. వీరు మాత్రం క్రీజులో పట్టుమని పది నిమిషాలు కూడా నిలదొక్కుకోలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేశాడు. ఇక 36 పరుగులతో తొలి ఇన్నింగ్స్‌లో పర్వాలేదనిపించిన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్‌లో తేలిపోయాడు. 5 పరుగులకే ఔటయ్యాడు. దాంతో, వీరిద్దరూ జట్టులో అవసరమా..? అన్న మాటలు వినపడుతున్నాయి. ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఈ ఇద్దరిపై టీమిండియా అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు.

సంక్షిప్త స్కోర్లు 

  • ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 474 ఆలౌట్ (స్టీవెన్ స్మిత్-140)
  • టీమిండియా తొలి ఇన్నింగ్స్: 369 ఆలౌట్ (నితీష్ రెడ్డి -114)
  • ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 234 ఆలౌట్
  • టీమిండియా రెండో ఇన్నింగ్స్: 155 ఆలౌట్