IND vs AUS Final: భారత్ కల చెదిరింది.. విశ్వవిజేత ఆస్ట్రేలియా

IND vs AUS Final: భారత్ కల చెదిరింది.. విశ్వవిజేత ఆస్ట్రేలియా

మనవాళ్లు విజయం సాధిస్తారు.. 20 ఏళ్ల కింద ఆసీస్ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంటారు అని ఎదురుచూస్తున్న 140  కోట్ల మంది భారతీయులకు నిరాశ ఎదురైంది. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ పోరులో భారత జట్టు ఓటమి పాలైంది. తొలుత భారత బ్యాటర్లను 240 పరుగులకే కట్టడిచేసిన కంగారూ జట్టు.. అనంతరం లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించి విశ్వవిజేతగా అవతరించింది.

ట్రావిస్ హెడ్ సెంచరీ

241 పరుగులు ఛేదనలో ఆరంభంలో తడబడ్డ ఆసీస్ బ్యాటర్లు.. ఆ తరువాత నిలకడగా ఆడుతూ మ్యాచ్ ను ఏకపక్షంగా ముగించారు. తొలుత వార్నర్(7), మిచెల్ మార్ష్(15), స్టీవ్ స్మిత్(4)లను ఔట్ చేసి భారత శిబిరంలో ఆనందం నింపిన మన బౌలర్లు ఆ తరువాత తేలిపోయారు. ఆసీస్ యువ బ్యాటర్ ట్రావిస్ హెడ్(137; 120 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్స్ లు) ఏకంగా సెంచరీ బాదాడు. అతనికి మరో ఎండ్ నుంచి మార్నస్ లబుషేన్( 58 నాటౌట్; 110 బంతుల్లో 4 ఫోర్లు) చక్కని సహకారం అందించాడు. మొదటి ఆచి తూచి ఆడిన హెడ్ క్రీజులో కుదురుకున్నాక భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు పడగొట్టగా.. షమీ, సిరాజ్ చెరో వికెట్ తీసుకున్నారు.

కోహ్లీ, రాహుల్ హాఫ్ సెంచరీలు

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. విరాట్ కోహ్లీ(54), కేఎల్ రాహుల్(66) అర్ధ శతకాలు బాధగా, రోహిత్ శర్మ(47) పర్వాలేదనిపించాడు. గిల్(4), అయ్యర్(4), జడేజా(9) సింగిల్ డిజిట్ కే పరిమితమవ్వగా.. మన సూర్య ప్రతాపం(18) పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా.. హెజిల్‌వుడ్, కమ్మిన్స్ రెండేసి వికెట్లు.. మాక్స్‌వెల్, జంపా చెరో వికెట్ తీసుకున్నారు.

ఆసీస్ ఆరోసారి

వన్డే ప్రపంచ కప్ చరిత్రలో గతంలో ఐదుసార్లు విజేతగా నిలిచిన ఆసీస్.. ఈ విజయంతో ఆరోసారి ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది.