IND vs AUS Final: ఓటమితో.. గ్రౌండ్‌లోనే బోరున ఏడ్చిన ఆటగాళ్లు

IND vs AUS Final: ఓటమితో.. గ్రౌండ్‌లోనే బోరున ఏడ్చిన ఆటగాళ్లు

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి అభిమానులను షాక్‌కు గురి చేసింది. ఇక ఆటగాళ్లు అయితే ఓటమిని జీర్ణించుకోలేక గ్రౌండ్‌లోనే కన్నీటి పర్యంతం అయ్యారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముఖాల్లో దుఃఖం కొట్టొచ్చినట్లు కనిపించింది. బూమ్రా, సిరాజ్ అయితే ఉబికి వస్తున్న కన్నీళ్లను బలవంతంగా ఆపుకోవటం కనిపించింది.  ఏ ఒక్కరి ముఖాల్లో కాసింతైనా సంతోషం కనిపించే లేద.. కన్నీళ్లు మాత్రమే ఉన్నాయి. నిరుత్సాహంతో కనిపించారు. ఇక మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన లక్ష మంది ప్రేక్షకుల ముఖాల్లోనూ దిగులు, బాధ కనిపించింది. 

స్టేడియంలో మన ఆటగాళ్లను చూసిన ప్రేక్షకులు సైతం కన్నీటి పర్యంతం అయ్యారు. వరస విజయాలతో ఉన్న జట్టు.. ఫైనల్ మ్యాచ్‌లో ఇలా డీలా పడటం.. అది కూడా ఘోరంగా ఓడిపోవటాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకుండా ఉన్నారు. అభిమానులు బోరున విలపించిన దృశ్యాలు స్క్రీన్ పై కనిపిస్తూనే ఉన్నాయి.

వరల్డ్ కప్ లీగ్ దశలోనే కాదు.. నాకౌట్ అయిన సెమీఫైనల్ మ్యాచ్ వరకు.. టీమిండియాకు ఓటమి అంటే తెలియదు.. ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచింది. తొమ్మిది లీగ్ మ్యాచులు ఉంటే.. అన్నింటిలోనూ విజయమే.. నాకౌట్ అయిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టును మట్టి కరిపించింది. అత్యంత బలమైన జట్టుగా.. వంద శాతం ఫిట్ ఉన్న ఆటగాళ్లతో.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో ప్రత్యర్థులను మట్టి కరిపించే స్థాయిలో ఫైనల్ కు ఎంట్రీ అయ్యింది టీమిండియా.

ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. వికెట్లు తీయటానికి నానా ఇబ్బంది పడ్డారు ఆటగాళ్లు.. ఫీల్డింగ్ లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేదు.. 47 పరుగులకే ఆసీస్ మూడు వికెట్లు పడగొట్టి.. మ్యాచ్ పై పట్టుబిగించిన మన కుర్రోళ్లు.. ఆ తర్వాత వికెట్ తీయటానికి విశ్వ ప్రయత్నాలు చేశారు.. అన్ని అస్త్రాలు ప్రయోగించారు.. అయినా ఫలితం లేదు.. టార్గెట్ చిన్నదే కావటం ఒకటి అయితే.. ఆసీస్ బ్యాటర్లను పడగొట్టటంలో తీవ్రంగా విఫలం అయ్యారు.