ఆ దృశ్యాలు నన్ను ఎంతో బాధించాయి.. మిచెల్‌ మార్ష్‌ చేష్టలపై స్పందించిన షమీ 

ఆ దృశ్యాలు నన్ను ఎంతో బాధించాయి.. మిచెల్‌ మార్ష్‌ చేష్టలపై స్పందించిన షమీ 

ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ ట్రోఫీని అగౌరవపరిచేలా వ్యవహరించిన ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్‌ మార్ష్‌ పై విమర్శలు పర్వం ఆగడం లేదు. అతడు వరల్డ్ కప్ ట్రోఫీ ప్రతిష్ఠకే మచ్చ తెచ్చాడని క్రీడా ప్రపంచం తిట్టిపోస్తోంది. ఇప్పటికే ఈ ఘటనలో అతనిపై భారత్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యింది. తాజాగా, ఇదే అంశంపై భారత సీనియర్‌ పేసర్ షమీ స్పందించారు. 

"మిచెల్‌ మార్ష్ అలా చేయడం నన్ను ఎంతో బాధించింది. ప్రతి జట్టు పోటీపడే ట్రోఫీ అది. ఎన్నో జట్లు వరల్డ్‌ కప్‌ ట్రోఫీ కోసం పోరాడాయి. అలాంటి ట్రోఫీని తలమీద పెట్టుకోవాలి. అలాకాకుండా కాళ్లు పెట్టడం నచ్చలేదు.." అని షమీ మాట్లాడారు. ఈ మెగా టోర్నీలో కేవలం 7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు తీసిన షమీ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు. అదే సమయంలో మూడుసార్లు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యారు. 

కేసు నమోదు

కాగా, వరల్డ్‌కప్ ట్రోఫీ మీద కాళ్లు ఉంచడం ద్వారా దాని ప్రతిష్టను అవమానించటంతో పాటు 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని అవమానించారని ఉత్తర్‌ ప్రదేశ్‌, అలీగఢ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త పండిట్ కేశవ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిల్లీ గేట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.