వరల్డ్ కప్ ఫైనల్ పోరులో భారత జట్టు ఓటమి పాలైన విషయం విదితమే. టోర్నీ అసాంతం అద్భుతంగా రాణించిన రోహిత్ సేన ఆఖరి మెట్టుపై బోల్తాపడింది. కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో పరాభవాన్ని చవిచూసి కప్ చేజార్చుకుంది. ఈ మ్యాచ్ ముగిసి దాదాపు నాలుగు రోజులు కావొస్తున్నా ఓటమిపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. తాజాగా, ఈ విషయంపై స్పందించిన భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్.. మిడిల్ ఓవర్‌లలో పరుగులు రాకపోవడమే టీమిండియా ఓటమికి కారణమని అభిప్రాయపడ్డారు.
ఫైనల్‌కు ముందు నాలుగు మ్యాచ్ లలో మూడింట 350కి పైగా స్కోర్ చేసిన భారత బ్యాటర్లు చివరి పోరులో అలాంటి దూకుడు కనపరచలేదు. ఫైనల్‌లో రోహిత్(47; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు) ధాటిగా ఆడి మంచి ఆరంభాన్ని(10 ఓవర్లలో 80 పరుగులు) ఇచ్చినా.. అతను వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు అలా ఆడలేకపోయారు. డిఫెన్సివ్‌కే అధిక ప్రాధాన్యమిచ్చారు. నాలుగో వికెట్ కు కోహ్లీ- రాహుల్ జోడి 109 బంతుల్లో 67 పరుగులు చేశారు. బౌండరీలు లేకపోయినా కోహ్లీ(63 బంతుల్లో 54) మంచి స్ట్రైక్ రేట్ కొనసాగించినప్పటికీ, మరో ఎండ్‌లో రాహుల్(66; 107 బంతుల్లో ఒక ఫోర్) టెస్ట్ ఆడాడు. ఈ ఆట తీరుపైనే గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
కెఎల్ రాహుల్ వంటి భారత బ్యాటర్లు మిడిల్ ఓవర్లలో రిస్క్ తీసుకొని ఉంటే ప్రపంచ కప్ 2023 ఫైనల్ ఫలితం భిన్నంగా ఉండేదని గంభీర్ చెప్పుకొచ్చారు.
"నేనెప్పుడూ చెబుతూనే ఉంటాను.. అత్యంత సాహసోపేతమైన జట్టే ప్రపంచ కప్ గెలుస్తుంది అని. రెండు వికెట్లు పాడినప్పుడు సరైన భాగస్వామ్యాన్ని నిర్మించడానికి మీకు సమయం అవసరం.. ఈ విషయాన్ని అర్థం చేసుకోగలం. అయితే 11 నుండి 40 ఓవర్లు చాలా చాలా ఎక్కువ సమయం. ఎవరైనా ఆ రిస్క్ తీసుకుని ఉండాల్సింది.."
"కోహ్లీ ఇన్నింగ్స్‌ను యాంకరింగ్ చేసే పాత్రను పోషించాడు.. కానీ మిగిలిన వారందరూ ఏం చేశారు. దూకుడుగా ఆడాల్సింది. రాహుల్ అలాంటి ఆట ఆడాల్సింది. దాని వల్ల ఏం జరిగేది.. మహా అయితే 150 ఆలౌట్ అయ్యేవాళ్లం.. అదే ధైర్యంగా ఆడి ఉంటే 310 పరుగులు చేసి భారత్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి ఉండేది. రోజులు మారాయి.. ఇది 1990 నాటిది కాదు. 240 అస్సలు మంచి స్కోరు కాదు. 300 పైచిలకు పరుగులు అవసరం. భారత్ అంత ధైర్యంగా ఆడలేదు.." అని గంభీర్ స్పోర్ట్స్‌కీడాతో వెల్లడించారు.