IND vs AUS: రోహిత్ మెరుపు ఇన్నింగ్స్.. ఆస్ట్రేలియా ఎదుట భారీ లక్ష్యం

IND vs AUS: రోహిత్ మెరుపు ఇన్నింగ్స్.. ఆస్ట్రేలియా ఎదుట భారీ లక్ష్యం

కీలక మ్యాచ్‌లో భారత బ్యాటర్లు బ్యాట్ ఝులిపించారు. కరేబియన్ గడ్డపై ఆసీస్ బౌలర్లను చీల్చి చెండాడుతూ పరుగుల వరద పారించారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(92; 41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. సూర్యకుమార్ యాదవ్(31; 16 బంతుల్లో), శివమ్ దూబే(28; 22 బంతుల్లో), హార్దిక్ పాండ్యా(27 నాటౌట్; 17 బంతుల్లో) విలువైన పరుగులు చేశారు. దాంతో, టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.

రోహిత్ కొట్టుడే కొట్టుడు

భారత బ్యాటింగ్‌లో రోహిత్ ఇన్నింగ్స్ తప్ప చెప్పడానికి మరొకటి లేదు. అంతలా హిట్‌మ్యాన్ విధ్వంసం సాగింది. హేజిల్‌వుడ్ వేసిన మోదటి ఓవర్‌లో కాస్త తడబడినట్లు కనిపించిన భారత కెప్టెన్.. స్టార్క్ వేసిన మూడో ఓవర్‌లో ఏకంగా 29 పరుగులు రాబట్టాడు. అక్కడినుంచి రోహిత్ క్రీజులో ఉన్నంతసేపు భారత స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 19 బంతుల్లోనే అర్ధ సెంచ‌రీ పూర్తి చేసుకున్న హిట్‌మ్యాన్.. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. 92 పరుగుల వద్ద స్టార్క్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

రోహిత్ క్రీజులో ఉన్నంతసేపు భారత్ స్కోర్ 230 దాటేలా కనిపించింది. అయితే, రోహిత్ వెనుదిరిగాక మిగిలిన బ్యాటర్లు ఆ దూకుడు కొనసాగించలేకపోయారు. సూర్య- దూబే జోడి 32 పరుగుల మంచి భాగస్వామ్యం నెలకొల్పినా.. ధాటిగా ఆడలేకపోయారు. చివరలో హార్దిక్ పాండ్యా(27 నౌటౌట్) పర్వాలేదనిపించాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ(0) నిరాశపరిచాడు. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.

ఆ ముగ్గురే టార్గెట్..!

ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ ఒక్కడే కట్టుదిట్టంగా బంతులేశాడు. తన 4 ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చాడు. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, మార్కస్ స్టోయినిస్ త్రయం ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ ముగ్గురూ వరుసగా 45, 48, 56 పరుగులు ఇచ్చారు.