బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం(నవంబర్ 22) నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనున్నది. రోహిత్ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో తొలి టెస్టులో బుమ్రా జట్టును నడిపించనున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైన టీమిండియా.. ఈ సిరీస్‌ను ఎలాగైనా గెలవాలనే కసితో బరిలోకి దిగబోతోంది.
కోహ్లీ దెబ్బ.. ఆసీస్ మీడియా అబ్బా..
2018-19 ఆసీస్ పర్యటనలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు చరిత్ర సృష్టిచింది. 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచి కంగారూల గర్వాన్ని అణిచింది. అలాంటి ప్రదర్శనను టీమిండియా మరోసారి పునరావృతం చేయాలని చూస్తోంది. అయితే, ఈసారి అది అంత తేలికైన విషయం కాదు. బౌన్సీ పిచ్‌లపై స్టార్క్, కమిన్స్, హాజిల్‌వుడ్ త్రయాన్ని ఎదుర్కోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. భీకర ఆసీస్ పేస్ బౌలింగ్‌కు ఎదురురొడ్డి నిలవాల్సి ఉంటుంది. అందునా, స్వదేశంలో కివీస్ చేతిలో ఓడి భారత జట్టు ఒత్తిడిలో ఉంది. స్టార్ ఆటగాళ్లెవరూ పెద్దగా ఫామ్‌లోనూ లేరు. చరిత్ర సృష్టించక పోయిన పర్లేదు కానీ, భంగపోకుంటే చాలన్నది మాజీల మాటలు.
Also Read : నేడు (నవంబర్ 21) తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు
పెర్త్ వేదికపై టీమిండియా ప్రదర్శన
ఆసీస్ పర్యటనకు వచ్చే జట్లకు పెర్త్ పిచ్ కఠినమైన వేదిక. అందుకు భారత జట్టు మినహాయింపేమీ కాదు. ఇప్పటివరకూ పెర్త్ వేదికగా ఆడిన నాలుగు టెస్టుల్లో మన జట్టు ఏకైక విజయానికి పరిమితమైంది. అది 2008లో.. భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అత్యుత్తమ ప్రదర్శనతో ఈ చారిత్రాత్మక విజయం దక్కింది.
- 1977: ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది.
- 1992: ఆస్ట్రేలియా 300 పరుగుల తేడాతో భారీ విజయం.
- 2008: భారత్ 72 పరుగులతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.
- 2012: ఆస్ట్రేలియా ఇన్నింగ్స్, 37 పరుగుల తేడాతో విజయం.
అయితే, ఇటీవలి కాలంలో క్రికెట్ ఆస్ట్రేలియా పెర్త్ ఆధారిత మ్యాచ్‌లను WACA నుండి ఆధునిక ఆప్టస్ స్టేడియంకు మార్చింది. 2018 పర్యటనలో భారత్ కొత్త వేదికపై ఏకైక టెస్టు ఆడింది. అందులో కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ, టీమిండియాకు పరాజయం తప్పలేదు.
ఆప్టస్ స్టేడియం: 146 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం.