IND vs AUS: ప్రతీకారం తీర్చుకున్నరు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

IND vs AUS: ప్రతీకారం తీర్చుకున్నరు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

2023 టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, 2023 వ‌న్డే ప్రపంచక‌ప్ ఫైన‌ల్ ఓటములకు రోహిత్ సేన బదులు తీర్చుకుంది. కీలక మ్యాచ్‌లో ఆసీస్‌ను మట్టికరిపించి టీ20 ప్రపంచకప్ సెమీస్ ఆశలకు గండికొట్టింది. హోరీహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత భారత జట్టు 205 పరుగుల భారీ స్కోర్ చేయగా.. లక్ష్య ఛేదనలో కంగారూలు 181 పరుగులకు వద్ద నిలిచిపోయారు. ఈ గెలుపుతో రోహిత్ సేన టేబుల్ టాపర్‌గా సూపర్-8ని ముగించింది. 

హెడ్ ఒంటరి పోరాటం

206 పరుగుల భారీ చేధనలో ఆసీస్ ధీటుగానే బదులిచ్చింది. వార్నర్(6) నిరాశపరిచినా.. ట్రావిస్ హెడ్ మిచెల్ మార్ష్ జోడి భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. పవర్‌ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోయి 65 పరుగులు చేసిన ఆసీస్.. 10 ఓవర్లు ముగిసేసరికి ఏకంగా 99 పరుగులు చేసింది. దాంతో, మ్యాచ్ చేజారినట్లే అనిపించింది. ఆ సమయంలో కుల్దీప్ మాయ చేశాడు. మిచెల్ మార్ష్(37; 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మాక్స్‌వెల్‌(20; 12 బంతుల్లో) పెవిలియన్ చేర్చాడు. దాంతో, మ్యాచ్ టీమిండియా చేతుల్లోకి వచ్చింది.

ఓవైపు వికెట్లు పడుతున్నా.. హెడ్(76; 43 బంతుల్లో 9 ఫోర్లు, 4  సిక్స్‌లు) తన పోరాటాన్ని ఆపలేదు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధిస్తూనే వచ్చాడు. చివరకు బుమ్రా 17వ ఓవర్‪లో హెడ్‌ని ఔట్ చేసి భారత జట్టుకు ఉపశమనం కలిగించాడు. ఆ మరుసటి ఓవర్ లో మాథ్యూ వేడ్ (1) వెనుదిరగ్గా.. అర్షదీప్ వేసిన 19వ ఓవర్‌లో టిమ్‌ డేవిడ్ (15) ఔటయ్యాడు. భారత బౌలర్లలో అర్షదీప్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసుకున్నారు.

రోహిత్ మెరుపులు

అంతకుముందు భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (92; 41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ (31; 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హార్దిక్ పాండ్యాల (27  నాటౌట్; 17 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), శివమ్ దూబె (28; 22 బంతుల్లో) ఫర్వాలేదనిపించారు. 

ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ (1/14) ఒక్కడు పొదుపుగా బౌలింగ్ చేయగా.. మిచెల్ స్టార్క్ (2/45), స్టోయినిస్‌ (2/56), కమిన్స్(0/48) భారీగా పరుగులు సమర్పించుకున్నారు.