పెర్త్: ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ సిరీస్ నేపథ్యంలో టీమిండియా ప్రాక్టీస్ ముమ్మరం చేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బుధవారం నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చాడు. ఎక్కువసేపు బ్యాటింగ్ చేసిన కోహ్లీకి టీమ్ బౌలర్లందరూ బౌలింగ్ చేశారు. మిగతా బ్యాటర్లు కూడా తమ బ్యాట్లకు పదును పెట్టుకున్నారు. సుదీర్ఘంగా సాగిన ఈ సెషన్‌లో రిషబ్ పంత్, బుమ్రాతో పాటు కొంత మంది ఇండియా–ఎ టీమ్ మెంబర్స్ కూడా పాల్గొన్నారు.
చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్, అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ప్రాక్టీస్‌ను పర్యవేక్షించారు. మరోవైపు వాకా సెంటర్ వికెట్‌పై జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌ను చూసేందుకు ప్రజలను అనుమతించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఇంట్రా స్క్వాడ్ మధ్యే ఈ మ్యాచ్ జరగనుంది. ప్రాక్టీస్ సెషన్స్ సందర్భంగా ఫొటోలు, వీడియోలతో పాటు డ్రోన్స్‌ను ఉపయోగించడం వల్ల ప్లేయర్లకు ఇబ్బంది అవుతుందని భావించిన మేనేజ్‌మెంట్ ముందుగా క్లోజ్డ్ డోర్ ప్రాక్టీస్ మ్యాచ్‌కు మొగ్గింది. కానీ దీనిపై ఆసీస్ మీడియాలో పలు కథనాలు రావడంతో అప్రమత్తమైన మేనేజ్‌మెంట్ ఫ్యాన్స్‌కు అనుమతి ఇచ్చారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ ఆసీస్‌తో తొలి టెస్ట్‌లో ఆడటంపై సందిగ్ధత వీడటం లేదు. అతను ముంబైలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌లో బుధవారం ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు.