IND vs AUS Final: చొచ్చుకొచ్చిన పాలస్తీనా మద్దతుదారుడు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

IND vs AUS Final: చొచ్చుకొచ్చిన పాలస్తీనా మద్దతుదారుడు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఓవైపు హోరాహోరీగా మ్యాచ్ జరుగుతుంటే.. మరోవైపు పాలస్తీనా మద్దతుదారుడు ఒకరు మైదానంలోకి చొచ్చుకొచ్చాడు. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకొచ్చిన అతడు నేరుగా విరాట్ కోహ్లీ దగ్గరకు వెళ్ళాడు. అతనిపై చేయి వేయడంతో కోహ్లీ అసౌకర్యంగా కనిపించాడు. దీంతో ఆటకు అంతరాయం కలిగింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 

పాలస్తీనా జెండాతో ముఖాన్ని కప్పుకున్న సదరు అభిమాని.. "స్టాప్ బాంబింగ్ పాలస్తీనా", "ఫ్రీ పాలస్తీనా" అని రాసి ఉన్న టీ షర్ట్ ధరించాడు. గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా ఇస్లామిస్ట్ గ్రూప్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొదట హమాస్ మెరుపుదాడులు చేయగా.. అందుకు ఇజ్రాయెల్ సైన్యం ప్రతీకారం తీర్చుకుంటోంది. ఈ దాడుల్లో గాజాలోని సామాన్య పౌరులు చనిపోతున్నారు. ఈ  క్రమంలోనే వారికి సంఘీభావం తెలుపుతూ.. పాలస్తీనాపై జరుగుతున్న దాడుల్ని ఆపాల్సిందిగా ఈ అజ్ఞాత వ్యక్తి మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భద్రతపై అనుమానాలు..!

వరల్డ్ కప్ ఫైనల్ జరగనివ్వమంటూ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఖలిస్తానీ ఉగ్రవాది, నిషేధిత సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నున్ బెదిరింపులకు దిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు హెచ్చరిస్తూ ఓ వీడియో కూడా విడుదల చేశాడు. అయినప్పటికీ పిచ్ ఇన్‌వేడర్ చొచ్చుకురావడమనేది భద్రతపై పలు అనుమానాలకు తావిస్తోంది.