కొత్త  ఏడాదీ..పాత కథే!..ఐదో టెస్టులోనూ ఇండియా తడబాటు

కొత్త  ఏడాదీ..పాత కథే!..ఐదో టెస్టులోనూ ఇండియా తడబాటు
  •     తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 185 రన్స్‌‌‌‌కే ఆలౌట్‌‌‌‌
  •     పోరాడిన రిషబ్ పంత్ 
  •     దెబ్బకొట్టిన బోలాండ్‌‌‌‌, స్టార్క్‌‌‌‌
  •     ఆస్ట్రేలియా 9/1

సిడ్నీ : నాటకీయ పరిణామాల తర్వాత రోహిత్ శర్మ  విశ్రాంతి తీసుకోవడంతో కొత్త ఏడాది జస్‌‌‌‌ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో బరిలోకి దిగిన  టీమిండియా పాత కథనే పునరావృతం చేసింది. బోర్డర్‌‌‌‌‌‌‌‌–గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో శుక్రవారం మొదలైన ఐదో, చివరి టెస్టులోనూ బ్యాటింగ్‌‌‌‌లో తడబడింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన బుమ్రాసేన.. కంగారూ పేస్ త్రయం దెబ్బకు  తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 185 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. విరాట్ కోహ్లీ (69 బాల్స్‌‌‌‌లో 17) మళ్లీ  ఔట్‌‌‌‌ సైడ్ ఆఫ్​ స్టంప్ బాల్‌‌‌‌కే వికెట్ ఇచ్చుకొని నిరాశ పరిచాడు.

తన స్టయిల్‌‌‌‌కు భిన్నంగా ఆడిన  రిషబ్ పంత్ (98 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 40) టాప్ స్కోరర్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. రవీంద్ర జడేజా (26), శుభ్‌‌‌‌మన్ గిల్ (20), చివర్లో కెప్టెన్ బుమ్రా (22) మాత్రమే కాసేపు ప్రతిఘటించారు.  స్కాట్ బోలాండ్‌‌‌‌ (4/34) నాలుగు వికెట్లతో ఇండియా నడ్డి విరవగా.. మిచెల్ స్టార్క్ (3/49), పాట్ కమిన్స్ (2/37) దెబ్బకొట్టారు. అనంతరం బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన ఆసీస్‌‌‌‌ 3 ఓవర్లలో 9/1తో నిలిచింది.

తొలి రోజు చివరి బంతికి ఓపెనర్‌‌‌‌‌‌‌‌ ఉస్మాన్ ఖవాజ (2)ను బుమ్రా ఔట్ చేశాడు. ప్రస్తుతం సామ్ కాన్‌‌‌‌స్టస్ (7 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నాడు. రెండో రోజు ఆసీస్‌‌‌‌ను బౌలర్లు ఎంత తక్కువ స్కోరుకు ఆలౌట్‌‌‌‌ చేస్తారన్న దానిపైనే ఇండియా భవితవ్యం ఉంటుంది.

అల్ట్రా డిఫెన్స్‌‌‌‌ పని చేయలే..

మేఘావృత వాతావరణంలో టాస్ నెగ్గిన కెప్టెన్ బుమ్రా బ్యాటింగ్ ఎంచుకోగా.. ఇండియా బ్యాటర్లు అతి జాగ్రత్త పడ్డారు. ఫస్ట్ ఓవర్ నుంచే అల్ట్రా డిఫెన్స్‌‌‌‌ చూపెట్టారు. కానీ, ఆసీస్ పేసర్‌‌‌‌‌‌‌‌ బోలాండ్ అద్భుతమైన బంతులతో  బెంబేలెత్తించాడు. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌‌‌‌తో  డిఫెన్స్‌‌‌‌ను బ్రేక్‌‌‌‌ చేశాడు. మరో ఎండ్‌‌‌‌లో స్టార్క్‌‌‌‌, కమిన్స్‌‌‌‌ కూడా పదునైన బంతులతో ఇండియా బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (10), కేఎల్ రాహుల్ (4) జట్టుకు సరైన ఆరంభం ఇవ్వడంలో మరోసారి ఫెయిలయ్యారు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే స్టార్క్ వేసిన హాఫ్ వ్యాలీని కాన్‌‌‌‌స్టస్ చేతుల్లోకి కొట్టి రాహుల్‌‌‌‌ ఔటయ్యాడు.

కాసేపటికే బోలాండ్ వేసిన గుడ్ లెంగ్త్ బాల్‌‌‌‌ను డిఫెండ్ చేసే ప్రయత్నంలో జైస్వాల్ స్లిప్‌‌‌‌లో కొత్త కుర్రాడు వెబ్‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌కు చిక్కాడు. ఆ తర్వాతి బాల్‌‌‌‌కే ఇచ్చిన క్యాచ్‌‌‌‌ను స్మిత్‌‌‌‌ డ్రాప్ చేయడంతో బతికిపోయిన కోహ్లీ.. శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌తో కలిసి జాగ్రత్తగా ఆడుతూ క్రీజులో కుదురుకున్నాడు. ఆఫ్ సైడ్ బాల్‌‌‌‌ను పూర్తిగా వదిలేసిన విరాట్ ఒక్క బౌండ్రీ కూడా కొట్టలేదు. కానీ, స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ లైయన్‌‌‌‌ వేసిన తొలి సెషన్ చివరి బాల్‌‌‌‌ను క్రీజు ముందుకొచ్చి డిఫెన్స్‌‌‌‌ ఆడే ప్రయత్నం చేసిన గిల్‌‌‌‌.. స్లిప్‌‌‌‌లో స్మిత్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇవ్వడంతో ఇండియా 57/3 స్కోరుతో లంచ్‌‌‌‌ బ్రేక్‌‌‌‌కు వెళ్లింది.

విరామం తర్వాత బోలాండ్‌‌‌‌ ఆఫ్ సైడ్ బాల్‌‌‌‌ను వెంటాడిన కోహ్లీ వికెట్ పారేసుకోవడంతో జట్టు 72/4తో కష్టాల్లో పడింది. ఈ టైమ్‌‌‌‌లో పంత్‌‌‌‌కు తోడైన జడేజా ఆరంభంలోనే రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. మరో ఎండ్‌‌‌‌లో పంత్‌‌‌‌ తన స్టయిల్‌‌‌‌కు పూర్తి భిన్నంగా డిఫెన్స్‌‌‌‌ చూపెట్టాడు. ఈ క్రమంలో కొన్ని బంతులు శరీరానికి బలంగా తగిలాయి. ఓ బాల్‌‌‌‌ అతని ఎడమ భుజానికి, మరో బాల్ హెల్మెట్‌‌‌‌కు.. రెండు బంతులు సున్నితమైన పొత్తి కడుపులో తగిలినా తను వెరవలేదు. వెబ్‌‌‌‌స్టర్ బౌలింగ్‌‌‌‌లో సిక్స్‌‌‌‌, లైయన్ ఓవర్లో ఫోర్‌‌‌‌‌‌‌‌ కొట్టి స్కోరు వంద దాటించాడు.

కానీ, పంత్‌‌‌‌, జడేజా అతి జాగ్రత్త కారణంగా రెండో సెషన్‌‌‌‌లో ఇండియా 50 రన్స్ మాత్రమే చేసింది. అప్పటిదాకా బాగా ఆడిన పంత్ టీ బ్రేక్ తర్వాత ఏకాగ్రత కోల్పోయాడు. బోలాండ్‌‌‌‌ వేసిన షార్ట్ బాల్‌‌‌‌కు పుల్ షాట్ ఆడి కమిన్స్‌‌‌‌కు క్యాచ్ ఇవ్వడంతో ఐదో వికెట్‌‌‌‌కు 48 రన్స్ (151 బాల్స్‌‌‌‌లో) భాగస్వామ్యం ముగిసింది. గత మ్యాచ్‌‌‌‌ సెంచరీ హీరో నితీశ్‌‌‌‌ రెడ్డి (0) తర్వాతి బాల్‌‌‌‌నే వెంటాడి స్లిప్‌‌‌‌లో స్మిత్‌‌‌‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చి డకౌటయ్యాడు. కాసేపటికే స్టార్క్‌‌‌‌ 140 కి.మీ స్పీడుతో వేసిన బాల్‌‌‌‌కు జడేజా వికెట్ల ముందు దొరికిపోయాడు. సుందర్‌‌‌‌‌‌‌‌ (14), ప్రసిధ్ కృష్ణ (3) కూడా నిరాశ పరచగా.. చివర్లో బుమ్రా దూకుడుగా బ్యాటింగ్‌‌‌‌ చేశాడు. మూడు ఫోర్లు, సిక్స్‌‌‌‌తో విలువైన రన్స్‌‌‌‌ అందించిన అతను కమిన్స్ బౌలింగ్‌‌‌‌లో ఆఖరి వికెట్‌‌‌‌గా ఔటయ్యాడు.

కాన్‌‌‌‌స్టస్‌‌‌‌ కవ్వింపు.. బుమ్రా ముగింపు

బ్యాటింగ్ ఫెయిల్యూర్‌‌‌‌‌‌‌‌తో తొలి రోజు ఇండియా నిరాశ పరచగా.. తన బౌలింగ్‌‌‌‌తో బుమ్రా మాత్రం సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు. ఇండియాను ఆలౌట్‌‌‌‌ చేసిన తర్వాత ఆసీస్ మూడు ఓవర్లు బ్యాటింగ్‌‌‌‌ చేసింది. యంగ్‌‌‌‌ సెన్సేషన్ కాన్‌‌‌‌స్టస్.. బుమ్రా బౌలింగ్‌‌‌‌లో తొలి బాల్‌‌‌‌నే బౌండ్రీకి చేర్చాడు. అయితే, మూడో ఓవర్ ఐదో బాల్‌‌‌‌కు ముందు అతను బుమ్రాను కవ్వించాడు. స్ట్రయికింగ్‌‌‌‌లో ఉన్న ఖవాజ.. బుమ్రా రనప్‌‌‌‌ మొదలుపెడుతుండగా  తాను రెడీగా లేనంటూ ఆపాడు.

దీనిపై బుమ్రా అసంతృప్తి వ్యక్తం చేయగా.. నాన్‌‌‌‌స్ట్రయికింగ్‌‌‌‌లో ఉన్న కాన్‌‌‌‌స్టస్‌‌‌‌ కల్పించుకొని స్లెడ్జింగ్‌ చేశాడు. ఈ ఇద్దరూ వాగ్వాదానికి దిగగా అంపైర్ విడదీశాడు. బుమ్రా వేసిన ఆఖరి బాల్‌‌‌‌ను బ్యాక్ ఫుట్‌‌‌‌పై డిఫెండ్ చేసే ప్రయత్నంలో ఖవాజ స్లిప్‌‌‌‌లో రాహుల్‌‌‌‌కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో ఇండియా ప్లేయర్లంతా గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకోగా వికెట్ పడిన వెంటనే బుమ్రా.. కాన్‌‌‌‌స్టస్‌‌‌‌ వైపు తిరిగి చూశాడు. తనను కవ్విస్తే ఎలా ఉంటుందో  చూపించాడు. 

8 2024–25 టెస్టు సీజన్‌‌‌‌లో ఇండియా 185 అంతకంటే తక్కువ స్కోర్లకు ఆలౌట్ అవ్వడం ఇది ఎనిమిదోసారి.

సంక్షిప్త స్కోర్లు

ఇండియా తొలి ఇన్నింగ్స్‌ ‌‌‌:  72.2 ఓవర్లలో 185 ఆలౌట్‌‌‌‌ (పంత్ 40, జడేజా 26, బోలాండ్ 4/31, స్టార్క్ 3/49).
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌ : 3 ఓవర్లలో 9/1 (కాన్‌‌‌‌స్టస్‌‌‌‌ 7 బ్యాటింగ్, బుమ్రా 1/7).