సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మ ఆడటం లేదు.. భారత క్రికెట్‌లో ఇప్పుడు ఇదే చర్చ. రోహిత్‌కు 'విశ్రాంతి' ఇచ్చామని మేనేజ్మెంట్ చెప్తున్నా.. ఫేలవ ఫామ్ నేపథ్యంలో అతన్ని పక్కన పెట్టారని చెప్పకనే చెప్పొచ్చు. తాజాగా, ఇదే విషయంపై స్పందించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ టేలర్ భారత మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. తప్పక గెలవాల్సిన టెస్టులో కెప్టెన్ విశ్రాంతి తీసుకున్న ఘటనలు గతంలో తానెప్పుడు చూడలేదని వ్యాఖ్యానించారు.
"నిజం చెప్పాలంటే, విశ్రాంతి అనేది పక్కదారి పట్టించడానికే. రోహిత్‌ను తప్పించారనే నేను ఇప్పటికీ అనుకుంటున్నా. నిర్ణయాత్మక టెస్టులో కెప్టెన్ విశ్రాంతి తీసుకోవాలనుకోవడం ఎక్కడా జరగదు. గతంలోనూ ఎన్నడూ చూడలేదు. ఫేలవ ఫామ్ నేపథ్యంలో అతన్ని తప్పించారు. కానీ, భారత మేనేజ్మెంట్ ఆ విషయాన్ని దాస్తోంది. నిజాన్ని అంగీకరించడం లేదు. ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఇటువంటి కఠిన పరిస్థితులు ప్రతి ఒక్కరికి ఎదురవవుతాయి. రోహిత్ విషయంలో ఇది దురదృష్టకరమే.." అని టేలర్ అన్నారు.
బుమ్రా తీరును ప్రశ్నించిన టేలర్
చివరి టెస్టుకు రోహిత్ గైర్హాజరు కావడంపై బుమ్రా చేసిన ప్రకటనను టేలర్ తోసిపుచ్చారు. ఇది నిజాయితీతో చెప్తున్న మాటలు కావని బుమ్రా వాదనను టేలర్ తిరస్కరించారు.
రోహిత్ గైర్హాజరీ నేపథ్యంలో జస్‌ప్రీత్ బుమ్రా జట్టును నడిపిస్తున్నాడు. టాస్ వేసే సమయంలో బుమ్రా.. రోహిత్‌కు రెస్ట్ ఇచ్చారని తెలిపాడు. ఇప్పటికీ తమ కెప్టెన్ అతడేనని వ్యాఖ్యానించాడు. అయితే రవిశాస్త్రి, సునీల్ గావస్కర్ మాత్రం రోహిత్ ఇప్పటికే కెరీర్ లో చివరి టెస్టుఆడేశాడంటూ పేర్కొనడం గమనార్హం.