IND vs AUS: దయచేసి కొత్త కెప్టెన్‌ని చూడండి.. నా పేరు నిలబెట్టండి: గవాస్కర్

IND vs AUS: దయచేసి కొత్త కెప్టెన్‌ని చూడండి.. నా పేరు నిలబెట్టండి: గవాస్కర్

న్యూజిలాండ్ సిరీస్ పోయె.. తదుపరి ఆడబోయే టెస్ట్ సిరీస్.. ఆస్ట్రేలియాతో. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. బీసీసీఐ సెలెక్టర్లకు కీలక సూచనలు చేశారు. కెప్టెన్‌గా రోహిత్ శర్మ అందించిన సేవలు ఇక చాలని.. అతని స్థానంలో కొత్త సారథిని ఎంపిక చేయాలని గవాస్కర్ సూచించారు. మాజీ దిగ్గజం అలా అనడానికి ఓ బలమైన కారణం ఉంది. అదేంటన్నది తెలుసుకుందాం.

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ 

ఆసీస్ మాజీ క్రికెటర్ అలెన్ బోర్డర్.. భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేర్ల మీద ఇరు దేశాల బోర్డులు ఒక టోర్నీని నిర్వహిస్తున్నాయి. ఆ టోర్నీ పేరే.. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ. 1996 నుంచి దీనిని నిర్వహిస్తున్నారు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ద్వైపాక్షిక ట్రోఫీలలో ఇదొకటి. ఈ క్రమంలో తన పేరిట నిర్వహించే టోర్నీలోనైనా భారత్ నెగ్గేలా నిర్ణయాలు తీసుకోవాలని గవాస్కర్.. బీసీసీఐకి సూచించారు.

రెగ్యులర్ కెప్టెన్ రోహిత్‌ శర్మ వ్యక్తిగత కారణాల రీత్యా మొదటి రెండు టెస్టులకుదూరం కానున్నాడని వార్తలు వస్తున్నాయి. అతని స్థానంలో వైస్ కెప్టెన్‌  జస్ప్రీత్ బుమ్రా జట్టును నడిపించనున్నాడని సమాచారం. ఇదే గవాస్కర్ కు నచ్చడం లేదు. రెండు టెస్టులు పూర్తయ్యాక జట్టులో చేరే ఆటగాడికి కెప్టెన్సీ ఇవ్వాల్సిన అవసరమేంటని మాజీ దిగ్గజం సెలెక్టర్లను ప్రశ్నించారు. మొదటి రెండు టెస్టులకు రోహిత్ అందుబాటులో ఉండకపోతే, అతన్ని ఒక  బ్యాటర్‌గా మాత్రమే పరిగణించాలని సెలక్షన్ కమిటీకి సూచించారు. అదే సమయంలో కొత్త కెప్టెన్‌ను ప్రకటించాలని కోరారు.

Also Read :  కోహ్లీ కెప్టెన్ అని ఎవరన్నారు

బుమ్రాపై ఒత్తిడి..

"కెప్టెన్‌ ఓపెనింగ్ టెస్టులో ఆడటం చాలా ముఖ్యం. అతను ఫిట్‌గా లేకుంటే అది వేరే విషయం. వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకొని.. వైస్ కెప్టెన్ నడిపించడమంటే.. డిప్యూటీపై ఒత్తిడి ఉంటుంది. రోహిత్ శర్మ మొదటి టెస్ట్‌లో ఆడడని.. అతను రెండో గేమ్‌ను కూడా కోల్పోవచ్చని నేను ఎక్కడో చదివాను. సమస్య వ్యక్తిగతమైనదైతే అతనికి విశ్రాంతి తీసుకోవాలని సెలక్టర్లు చెప్పాలి.."

" ఒక ఆటగాడు వ్యక్తిగత విషయాలను పూర్తి చేసి, జట్టులో చేరితే.. పూర్తి స్థాయి బ్యాటర్‌గా అవకాశం ఇవ్వొచ్చు. అంతేకానీ, జట్టు బాధ్యతలు అప్పగించడం సరైనది కాదు.. మొదటి నుండి ఒక నాయకుడు జట్టుతో కలిసి ఉండటం చాలా ముఖ్యం. స్వదేశంలో టెస్ట్ సిరీస్‌ను 3-0తో కోల్పోయ్యాక జరుగుతున్న టోర్నీ. ఈ సమయంలో కెప్టెన్‌ సహచరులతో కలిసి ఉండటం చాలా అవసరం.." అని గవాస్కర్ స్పోర్ట్స్ తక్‌లో అన్నారు. నిజానికి ఈ టోర్నీ జరుగుతోంది.. గవాస్కర్ పేరిట. కావున ఇందులోనైనా నెగ్గి తన పేరు నిలబెట్టాలని ఆయన ఈ సూచన చేశారు.

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్

నవంబర్ 22 నుంచి బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ లు జరగనున్నాయి.

  • మొదటి టెస్ట్ (నవంబర్ 22 - 26): పెర్త్
  • రెండో టెస్ట్ (డిసెంబర్ 06 - 10): అడిలైడ్
  • మూడో టెస్ట్ (డిసెంబర్ 14 - 18): బ్రిస్బేన్
  • నాలుగో టెస్ట్ (డిసెంబర్ 26 - 31): మెల్బోర్న్
  • ఐదో టెస్ట్ (జనవరి 03 - 08): సిడ్నీ