ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అద్భుత సెంచరీ (140) సాధించడంతో మెల్ బోర్న్ వేదికగా జరుగుతోన్న బాక్సింగ్ డే టెస్ట్ ఫస్ట్ ఇన్సింగ్స్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. 122.4 ఓవర్లలో 474 పరుగుల భారీ స్కోర్ చేసింది అతిథ్య జట్టు. స్మిత్ సెంచరీకి తోడు ఓపెనర్స్ సామ్ కొన్స్టాస్ 60, ఉస్మాన్ ఖవాజా 57 పరుగులతో రాణించారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 72 పరుగులు చేసి మరోసారి ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. చివర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (49) మెరుపు ఇన్సింగ్ ఆడి జట్టుకు భారీ స్కోర్‌కు అందించాడు.
ఆట తొలిరోజు భారత బౌలర్లపై పూర్తి అధిపత్యం చెలాయించిన ఆసీస్ బ్యాటర్లు.. రెండోరోజు అదే విధంగా చెలరేగిపోయారు. ఒక్క బుమ్రాను మినహాయించి.. మిగిలిన టీమిండియా బౌలర్లను ఉతికారేశారు. సిరాజ్, ఆకాష్ దీప్ బౌలింగ్లో పరుగులు రాబట్టారు. ఆసీస్ బ్యాటర్లు సెకండ్ డే మరింత స్పీడ్‌గా బ్యాట్లు ఝులిపించడంతో అతిథ్య జట్టు 474 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఓవర్ నైట్ స్కోర్ 311/6తో రెండో రోజు ఇన్సింగ్స్ ఆరంభించిన ఆసీస్.. మరో 163 పరుగులు జోడించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. భారత స్టార్ బౌలర్ బుమ్రా 4 వికెట్లు తీసి మరోసారి భారత్‌ను ఆదుకోగా.. జడేజా మూడు వికెట్ల తీశాడు. ఆకాష్ దీప్ రెండు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఒక సాధించాడు. అనంతరం భారత ఓపెనర్స్ యశస్వీ జైశ్వాల్, రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు దిగారు.
భారీ స్కోర్ సాధించిన అతిథ్య జట్టు మ్యాచ్‌పై పట్టుబిగిస్తోంది. ప్రస్తుతం ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. పెర్త్ టెస్టులో భారత్.. బ్రిస్బేన్ మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధించగా.. మూడో టెస్ట్ వర్షం కారణంగా డ్రా అయిన విషయం తెలిసిందే. నాలుగో టెస్ట్‌లో విజయం సాధించి సిరీస్‌లో అధిక్యంలోకి వెళ్లాలని అతిథ్య జట్టు ఉవ్విళ్లూరుతోంది.