IND vs BAN: బంగ్లాదేశ్‌ చిత్తు.. రెండో టీ20లోనూ మనదే విజయం

IND vs BAN:  బంగ్లాదేశ్‌ చిత్తు.. రెండో టీ20లోనూ మనదే విజయం

ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. 86 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 221 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో బంగ్లా 135 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో సూర్య సేన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలివుండగానే సొంతం చేసుకుంది. 

తెలుగు కుర్రాడి మెరుపులు 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు నితీశ్‌ రెడ్డి (74;34  బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), రింకు సింగ్ (53; 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలు చేయగా.. హార్దిక్ పాండ్యా (32; 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొస్సేన్ 3, ముస్తాఫిజుర్ 2, తంజిమ్ హసన్ 2, తస్కిన్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు.

ఆదుకున్న మహ్మదుల్లా

222 పరుగుల భారీ ఛేదనలో బంగ్లాదేశ్‌ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూనే వచ్చింది. పర్వేజ్ హొస్సేన్(16), లిట్టన్ దాస్(14), నజ్ముల్ హుస్సేన్ శాంటో(11), తౌహిద్ హృదయ్(2), మెహిదీ హసన్(`6), జాకర్ అలీ(1).. ఇలా ఒకరివెంట మరొకరు పెవిలియన్ బాట పట్టారు. వందలోపే ఆలౌట్ అయ్యేలా కనిపించిన బంగ్లాను మహ్మదుల్లా ఆదుకున్నాడు. 39 బంతుల్లో 41 పరుగులు చేశాడు. చివరకు బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది.  

ALSO READ | IND vs BAN: నితీష్, రింకూ హాఫ్ సెంచరీలు.. బంగ్లా టార్గెట్ 222

భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, నితీష్ రెడ్డి రెండేసి వికెట్లు పడగొట్టగా.. వాషింగ్టన్ సుందర్, అర్షదీప్, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ వికెట్ చొప్పున తీసుకున్నారు.

శనివారం ఉప్పల్‍లో మ్యాచ్ 

కాగా, ఈ ఇరు జట్ల మధ్య శనివారం(అక్టోబర్ 12) ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా మూడో టీ20 జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ టికెట్ల విక్రయాలు మొదలయ్యాయి. పేటీఎం ఇన్ సైడర్ యాప్‌లో టికెట్లు కొనుగోలు చేయవచ్చు.