IND vs BAN 2nd Test: వందకు ఆలౌటైనా ఫర్వాలేదు: రోహిత్‌‌

కాన్పూర్‌‌: బంగ్లాదేశ్‌‌తో రెండో టెస్ట్‌‌లో ఫలితాన్ని రాబట్టేందుకు తాము వంద రన్స్‌‌కు ఆలౌటైనా ఫర్వాలేదనుకున్నామని టీమిండియా కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ అన్నాడు. ఈ వ్యూహంతోనే వీలైనంత వేగంగా, రిస్క్‌‌తో ఆడామని స్పష్టం చేశాడు. ‘అప్పటికే మేం రెండున్నర రోజుల ఆటను కోల్పోయాం. నాలుగో రోజు ఆట మొదలైనప్పుడే బంగ్లాను త్వరగా ఆలౌట్‌‌ చేయాలనుకున్నాం. ఆ తర్వాత మా బ్యాటింగ్‌‌పై దృష్టి పెట్టాలనుకున్నా... ప్రత్యర్థి స్కోరుపై ఇది ఆధారపడి ఉంటుంది. రెండో ఇన్నింగ్స్‌‌లో బంగ్లా స్కోరు తక్కువగా ఉంటే మేం వీలైనంత వేగంగా బ్యాటింగ్‌‌ చేయాలని ముందుగానే ప్లాన్‌‌ చేశాం. చిన్న టార్గెట్‌‌ను ఈజీగా ఛేదించాం. అయితే ఈ పిచ్‌‌పై బౌలర్లు పెర్ఫామెన్స్‌‌ సూపర్బ్‌‌. ఏమాత్రం సహకారం లేకపోయినా బంగ్లాను ఆలౌట్‌‌ చేయడంలో వాళ్లు కీలక పాత్ర పోషించారు. అదే మాకు కలిసొచ్చింది. గెలవాలనే ఒకే ఒక్క మైండ్‌‌సెట్‌‌తో మేం ఈ మ్యాచ్‌‌ ఆడాం..’ అని రోహిత్‌‌ పేర్కొన్నాడు. 

క్రికెట్‌‌ను ముందుకు తీసుకెళ్లే క్రమంలో కొత్త వారితో కలిసి ఆడాల్సి వస్తుందని కోచ్‌‌ గంభీర్‌‌ గురించి వ్యాఖ్యానించాడు. ‘ప్లేయర్లు ఒక్కో దశలో వేర్వేరు వ్యక్తులతో కలిసి పని చేయాల్సి వస్తుంది. ద్రవిడ్‌‌తో మా ప్రయాణం అద్భుతంగా సాగింది. కానీ ఆటతో పాటే మనమూ కొత్త వారితో ముందుకు సాగాలి. గంభీర్‌‌తో కలిసి నేను చాలా మ్యాచ్‌‌లు ఆడా. అతని మైండ్‌‌సెట్‌‌ ఎలా ఉంటుందో తెలుసు. ప్లేయర్లు తమకు నచ్చిన విధంగా ఆడటానికి కావాల్సినంత స్వేచ్ఛను ఇస్తాడు’ అని హిట్‌‌మ్యాన్‌‌ వ్యాఖ్యానించాడు.