IND vs BAN: పేస్‌తో భయపెట్టేలా వ్యూహాలు.. భారత్ - బంగ్లా తొలి టెస్టుకు ఎర్రటి పిచ్‌

IND vs BAN: పేస్‌తో భయపెట్టేలా వ్యూహాలు.. భారత్ - బంగ్లా తొలి టెస్టుకు ఎర్రటి పిచ్‌

భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌‌కు సమయం దగ్గరపడుతోంది. మరో ఐదు రోజుల్లో ఈ సిరీస్ తెరలేవనుంది. ఇప్పటికే ఇరు దేశాల బోర్డులు తమ తమ జట్లను ప్రకటించగా.. ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో తలమునకలై ఉన్నారు. తొలి టెస్టుకు చెన్నై, రెండో టెస్టుకు కాన్పూర్  ఆతిథ్యమివ్వనున్నాయి. ఇదిలావుంటే, చెన్నై గడ్డపై బంగ్లాదేశ్‌ బ్యాటర్లకు అడ్డుకట్ట వేసేందుకు టీమిండియా అదిరిపోయే వ్యూహాన్ని అనుసరిస్తోంది. 

చెన్నై వేదికగా భారత్- బంగ్లా మధ్య జరగనున్న తొలి టెస్టుకు రెడ్ సాయిల్ పిచ్ సిద్ధం చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఎర్రమట్టి పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉండటంతో పాటు పేసర్లకు అనుకూలిస్తుంది. ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్ జట్టుకు కఠిన సవాళ్లు ఎదురు కానున్నాయి. నిజానికి బంగ్లాదేశ్ జట్టు స్వదేశంలో ఎక్కువగా బ్లాక్ సాయిల్ పిచ్‌పై ఆడుతుంది. నల్లటిమట్టి పిచ్‌లు బ్యాటింగ్‌కు ప్రతికూలంగా, స్పిన్‌కు అనుకూలిస్తాయి. అలాంటిది వారిని ఇప్పుడు రెడ్ సాయిల్ పిచ్‌తో ఇబ్బంది పెట్టనున్నారు. పేస్‌కు అనుకూలించే ఎర్ర మట్టి పిచ్‌పై బుమ్రాను ఎదుర్కోవడం బంగ్లా బ్యాటర్లకు కష్టమైన పనే.

ఫలితం వచ్చేనా..!

ఎర్రమట్టి పిచ్‌లో బంకమట్టి చాలా తక్కువగా ఉంటుంది. దాంతో మొదటి రెండు రోజులు బౌన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది సీమర్లకు అనుకూలం. రోజులు గడిచేకొద్దీ పిచ్‌పై పగుళ్లు ఏర్పడతాయి. చివరి రెండు రోజులు స్పిన్నర్లకు అనుకూలించనుంది. ఈ మ్యాచ్‌లో ఫలితం వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. భారత త్రయం బుమ్రా, జడేజా, అశ్విన్‌లను ఎదుర్కోవడం బంగ్లా బ్యాటర్లకు అంత సులువైన పైని కాదు. 

ALSO READ : మనోళ్లు మొదలెట్టారు..బంగ్లాతో టెస్ట్ సిరీస్ కు ప్రాక్టీస్ షురూ

ఎందుకీ ఈ ఎర్రటి వ్యూహం..?

త్వరలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 జరగనుంది. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. బహుశా ఈ పర్యటనను దృష్టిలో ఉంచుకుని భారత్- బంగ్లా తొలి టెస్టుకు ఎర్రమట్టి పిచ్ ఎంపిక చేసిండొచ్చు.

టెస్టు సిరీస్‌ షెడ్యూల్

  • తొలి టెస్టు: సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 23 వరకు (చెన్నై)
  • రెండో టెస్టు: సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు (కాన్పూర్)