అలసత్వం వద్దు.. వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభానికి ముందు మేటి జట్లకు మాజీ క్రికెటర్లు చెప్పిన మాటలివి. చిన్న జట్లను తేలిగ్గా తీసుకోకండి.. చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాల్సిందే అంటూ వారు అన్ని జట్లను ముందుగానే హెచ్చరించారు. కానీ ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు ఆ మాటలనుపెడచెవిన పెట్టాయి. అందుకే పసికూన జట్ల చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకొని తలెత్తుకోలేక పోతున్నాయి.
మూడు రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఇంగ్లాండ్ ఓడితే.. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓటమిపాలైంది. ఈ క్రమంలో గురువారం ఇండియా-బంగ్లాదేశ్ నుండడంతో.. మాజీ క్రికెటర్లు రోహిత్‌కు జాగ్రత్తలు చెప్తున్నారు. వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న భారత జట్టు.. చిన్న జట్లతో తలపడుతున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పైగా ఈ మధ్యన బంగ్లాదేశ్‌పై మన రికార్డులు ఏమంతంగా బాగోలేవు. ఆడిన చివరి 4 వన్డేల్లో 3 ఓడాం. 2023 ఆసియాకప్‌లోనూ బంగ్లా చేతిలో పరాభవాన్ని ఎదుర్కొన్నాం. అందుకే బంగ్లాదేశ్‌ను తేలిగ్గా తీసుకోకూడదని సూచిస్తున్నారు.
ఆ ముగ్గురితో జాగ్రత్త
బంగ్లాదేశ్‌కు ప్రపంచ కప్ గెలిచే సత్తా లేకపోయినా.. ఆ దిశగా వెళ్లే జట్లకు అడ్డుకట్ట వేయగలదు. షకిబుల్ హసన్, ముష్ఫికర్ రహీం, ముస్తాఫిజర్ రెహ్మన్.. ఈ ముగ్గురే ఆ జట్టు ప్రధాన బలం. బంగ్లా భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేయాలంటే ముందుగా ముష్ఫికర్ రహీంని కట్టడి చేయాలి. ఇక షకిబ్.. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణించగల సమర్ధడు. ఇక ఐపీఎల్ అనుభవం దృష్ట్యా ముస్తాఫిజర్ కూడా ప్రమాదకరంగా మారే అవకాశం లేకపోలేదు.
ఈ మ్యాచ్‌లో భారత జట్టు పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగొచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమవుతున్న శార్దూల్ ఠాకూర్ స్థానంలో అశ్విన్ కు తుది జట్టులో స్థానం దక్కొచ్చు.
ALSO READ : NED vs RSA: నెదర్లాండ్స్ విజయం వెనుక మన దేవుడు.. వీర హనుమాన్
భారత జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్.