IND vs BAN: బంగ్లాదేశ్‌‌పై భారీ విజయం.. సెమీస్ చేరిన టీమిండియా

IND vs BAN: బంగ్లాదేశ్‌‌పై భారీ విజయం.. సెమీస్ చేరిన టీమిండియా

2024 టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ సేన సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం(జూన్ 22) ఆంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత భారత జట్టు 196 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది.

అలరించిన పాండ్యా

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (6) ఒక్కడే నిరాశ పరిచాడు. రోహిత్ శర్మ (23; 11 బంతుల్లో), విరాట్ కోహ్లీ (37; 28 బంతుల్లో), రిషభ్‌ పంత్ (36; 24 బంతుల్లో), శివమ్ దూబె (34; 24 బంతుల్లో), హార్దిక్ పాండ్యా(50*; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. బంగ్లా బౌలర్లలో తంజిమ్ హసన్ 2, రిషాద్ హొస్సేన్ 2, షకిబ్ అల్ హసన్ ఒక వికెట్ పడగొట్టారు.

పోరాడిన శాంటో

197 పరుగుల భారీ ఛేదనలో బంగ్లాదేశ్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. మంచి భాగస్వామ్యాలు నెలకొల్పినా.. వేగంగా ఆడలేకపోయారు. అదే వారికి విజయాన్ని దూరం చేసింది. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో(40; 32 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్స్‌లు) ఒక్కడు కాసేపు పోరాడాడు. 

భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్, బుమ్రా రెండేసి వికెట్లు తీసుకున్నారు. భారత స్పీడ్ గన్ జస్ప్రీత్ బుమ్రా తన 4 ఓవర్లలో కేవలం 13 పరుగులివ్వడం గమనార్హం. బుమ్రాను ఎదుర్కోవడానికి బంగ్లా బ్యాటర్ల దగ్గర సమాధానమే లేకపోయింది. వికెట్ కాపాడుకుంటే చాలు అన్నట్లుగా బ్యాటింగ్ చేశారు.