IND vs BAN: కోహ్లీ వీరోచిత సెంచరీ.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం

IND vs BAN: కోహ్లీ వీరోచిత సెంచరీ.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం

ప్రపంచ కప్‌లో టీమిండియా మరో విజయాన్ని అందుకుంది. పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌‌ను ఏకపక్షంగా ముగించింది. బంగ్లాదేశ్‌ నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని భారత బ్యాటర్లు ఆడుతూ పాడుతూ చేధించారు. తొలుత రోహిత్‌, గిల్‌.. విజయానికి గట్టి పునాది వేయగా... కోహ్లీ పనిని పూర్తి చేశాడు. శతకం బాది టీమిండియాకు మరో విజయాన్ని అందించాడు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఓపెనర్లు తాన్జిద్‌ హసన్‌(51), లిటన్‌ దాస్‌(66) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్‌, జడేజా రెండేసి వికెట్లు తీసుకోగా.. శార్దూల్‌ ఠాకూర్‌, కుల్దీప్ యాదవ్ చెరో ఒక వికెట్‌ పడగొట్టారు.

రోహిత్‌, గిల్‌ జోరు.. కోహ్లీ శతకం

అనంతరం 257 పరుగుల లక్ష్య ఛేదనను భారత్‌ ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ లు బౌండరీల వర్షం కురిపించారు. తొలి వికెట్‌ కు  12.4 ఓవర్లలో  88 పరుగులు జోడించారు. ధాటిగా ఆడే ప్రయత్నంలో రోహిత్‌(43) తృటిలో అర్థ సెంచరీ కోల్పోయినా.. గిల్‌(53) హాఫ్‌ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. వీరిద్దరూ వెనుదిరిగాక ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ.. బంగ్లా పులులను తోకముడిచేలా చేశాడు. 97 బంతుల్లో 103 నాటౌట్‌,  6 ఫోర్లు, 4 సిక్సర్లు బాది జట్టుకు నాలుగో విజయాన్ని అందించాడు.