IND vs BAN: కోహ్లీ స్వార్థపరుడు.. అతడేంటో ప్రపంచానికి ఇప్పుడు తెలిసింది: భారత అభిమాని

IND vs BAN: కోహ్లీ స్వార్థపరుడు.. అతడేంటో ప్రపంచానికి ఇప్పుడు తెలిసింది: భారత అభిమాని

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. విజయానికి రెండు పరుగులు కావాల్సిన సమయంలో సిక్స్ బాదిన విరాట్.. జట్టుకు విజయాన్ని అందించంతో పాటు తన వన్డే కెరీర్‌లో 48వ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌ సాయంతో 103 ప‌రుగులు చేశాడు. 

కోహ్లీ చేసిన ఈ సెంచరీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విరాట్ స్వార్థపరుడంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అతడు 77 పరుగుల వద్ద ఉన్నప్పుడు జట్టు విజయానికి 23 పరుగులు కావాలి. ఆ సమయంలో అతడు సెంచరీ చేస్తాడని ఎవరూ ఊహించరు. కానీ, కేఎల్ రాహుల్ సహకారంతో అతడు వంద మార్క్‌ను చేరుకున్నాడు. ఇది కొందరి అభిమానులకు రుచించడం లేదు. వ్యక్తిగత రికార్డు కోసమే.. సింగిల్స్ తీయలేదని విమర్శిస్తున్నారు. త్వరగా విజయం సాధించివుంటే రన్‌రేట్ మెరుగయ్యేదని చెప్తున్నారు. 

కోహ్లీ స్వార్థపరుడు..

ఇదిలావుంటే.. కోహ్లీ స్వార్థపరుడంటూ ఓ భారత అభిమాని(@NishaRo45_) నెట్టింట పోస్ట్ పెట్టింది. ఒక భారత అభిమానిగా తన 18 ఏళ్ల క్రికెట్ వీక్షణలో కోహ్లిని మించిన సెల్ఫిష్ ప్లేయ‌ర్‌ను చూడలేదని తెలిపింది."నేను 18 ఏళ్లుగా క్రికెట్‌ను అనుసరిస్తున్నాను. ఒక భారత క్రికెట్ జట్టు అభిమానిగా.. కోహ్లీ అత్యంత స్వార్థపూరిత ఆటగాడని ధైర్యంగా చెప్పగలను. అతను తన సెంచరీ కోసం.. సింగిల్‌ను తిరస్కరించినప్పుడే అతడేంటో ప్రపంచానికి తెలిసింది. అతను సచిన్‌తో సమానం కాదు కదా! కనీసం క్రికెటర్‌గా విజయ్ శంకర్‌తో కూడా సరితూగలేడు.." అని నిషా రావు పేరిట ఉన్న యూ యూజర్ ట్వీట్ చేసింది.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 256పరుగులు చేయగా.. భారత్ 41.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. భారత జట్టు తదుపరి మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది. ఈ  మ్యాచ్ అక్టోబర్ 21న ధర్మశాల వేదికగా జరగనుంది.