IND vs ENG 1st ODI: కిక్కు లేదు.. తేలిపోయిన బజ్‌బాల్ వీరులు.. టీమిండియా ఈజీ విక్టరీ

IND vs ENG 1st ODI: కిక్కు లేదు.. తేలిపోయిన బజ్‌బాల్ వీరులు.. టీమిండియా ఈజీ విక్టరీ

మా వాళ్ల ఆటే వేరు.. టెస్ట్‌లు, వన్డేలు, టీ20లు అన్న తేడాలుండవ్.. ధనాధన్ బాదుడే.. మా వాళ్ల వేగానికి భారత బౌలర్లు ఎటు పోతారో.. అభిమానులు ఎటు పోతారో.. ఇవీ భారత పర్యటనకు వచ్చే ముందు ఇంగ్లండ్ బ్యాటర్ల గురించి ఆ దేశ మాజీ క్రికెటర్లు వాగిన మాటలు. తీరా ఇక్కడికి వచ్చాక.. అంతా రివర్స్‌లో జరుగుతోంది. బజ్‌బాల్ వీరులు కాసేపు మెరుపులు మెరిపిస్తున్నా.. ఆ తరువాత తోక ముడుస్తున్నారు. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో సరిగ్గా అదే జరిగింది. 

ఆరంభంలో ఇంగ్లీష్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్‌ (26 బంతుల్లో 43), బెన్ డకెట్‌ (29 బంతుల్లో 32) కొట్టుడు చూస్తే.. ఇంగ్లండ్ జట్టు 350 స్కోర్ దాటడం ఖాయమనిపించింది. అది గడిచిన ఓ గంట తరువాత చూస్తే.. 250 దాటుతారా..! అనిపించింది. ఇందులో ఏదీ జరగలేదు. 50 ఓవర్లు కూడా పూర్తిగా ఆడకుండానే ఇంగ్లండ్ బ్యాటర్లు చాపచుట్టేశారు.  47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటయ్యారు.

ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత బ్యాటర్లు ఆడుతూ పాడుతూ చేధించారు. రోహిత్ శర్మ (2), యశస్వి జైస్వాల్(15) నిరాశపరిచిన.. తరువాత వచ్చిన ముగ్గురు అర్ధ శతకాలు బాదారు. శుభ్‌మాన్ గిల్(96 బంతుల్లో 87; 14 ఫోర్లు) శ్రేయాస్ అయ్యర్(36 బంతుల్లో 59; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్ పటేల్(47 బంతుల్లో 52; 6 ఫోర్లు, ఒక సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. చివరలో అక్సర్, రాహుల్(2), గిల్ వెంటవెంటనే ఔటవ్వగా.. పాండ్యా(9 నాటౌట్), జడేజా(12 నాటౌట్) జోడి మిగిలిన పని పూర్తి చేశారు. 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టీమిండియా లక్ష్యాన్ని చేధించింది. 

ఇంగ్లండ్ 248 ఆలౌట్

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లిష్‌ జట్టు 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ జాస్ బట్లర్‌ (67 బంతుల్లో 52; 4 ఫోర్లు), బెతెల్‌ (64 బంతుల్లో 51; 3 ఫోర్లు, ఒక సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. ఓపెనర్లు సాల్ట్‌ (26 బంతుల్లో 43; 5 ఫోర్లు; 3 సిక్స్‌లు), డకెట్‌ (29 బంతుల్లో 32; 6 ఫోర్లు) మంచి ఆరంభాన్ని ఇచ్చినా.. తరువాత వచ్చిన బ్యాటర్లు దూకుడు కొనసాగించలేకపోయారు. భారత స్పిన్నర్లు ఎంట్రీ ఇవ్వడంతో.. మ్యాచ్ తలకిందులయ్యింది. 

భారత బౌలర్లలో హర్షిత్‌ రాణా, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు పడగొట్టగా.. అక్షర్‌ పటేల్‌, మహ్మద్‌ షమీ, కుల్‌దీప్‌ యాదవ్‌ తలో వికెట్‌ తీశారు.

ALSO READ | రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన భారత క్రికెట్ దిగ్గజం