తొలి టెస్టు ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. విశాఖ సాగర తీరాన ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో 106 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత జట్టు నిర్ధేశించిన 399 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ 292 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
399 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్‌కు మంచి ఆరంభం లభించింది. తొలి వికెట్‍కు జాక్ క్రాలే(73)- బెన్ డకెట్(28) జోడి 50 పరుగుల మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతోన్న ఈ జోడీని అశ్విన్ విడగొట్టాడు. డకెట్‌ను పెవిలియన్ చేర్చి బ్రేక్ త్రూ అందించాడు. అనంతరం అతని స్థానంలో నైట్ వాచ్‌మెన్‌గా క్రీజులోకి వచ్చిన రెహాన్ అహ్మద్(23) పర్వాలేదనిపించాడు. క్రాలేతో కలిసి రెండో వికెట్‌కు 45 పరుగులు జోడించాడు. వేగంగా ఆడుతూ భారత బౌలర్లకు సవాల్ విసిరాడు. అతన్ని అక్సర్ పటేల్ చాలా తెలివిగా బోల్తా కొట్టించాడు. ఓ మంచి బంతితో ఎల్బీగా వెనుదిరిగేలా చేశాడు. ఆ తరువాత బుమ్రా, అశ్విన్ జోడి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు.
ఒల్లీ పోప్(23), జో రూట్(16), జానీ బెయిర్‌స్టో(26), బెన్ స్టోక్స్(11), బెన్ ఫోక్స్(36)... ఇలా ఇంగ్లాండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూనే వచ్చింది. చివరలో స్పిన్నర్ టామ్ హార్ట్లీ(36) వేగంగా ఆడుతూ భారత అభిమానులను భయపెట్టినా.. అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లేకపోయింది. బుమ్రా(9 వికెట్లు)ను మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
CASTLED! ⚡️⚡️
— BCCI (@BCCI) February 5, 2024
Jasprit Bumrah wraps things up in Vizag as #TeamIndia win the 2nd Test and level the series 1⃣-1⃣#TeamIndia | #INDvENG | @Jaspritbumrah93 | @IDFCFIRSTBank pic.twitter.com/KHcIvhMGtD
స్కోర్లు:
- టీమిండియా తొలి ఇన్నింగ్స్: 396
- ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 253
- టీమిండియా రెండో ఇన్నింగ్స్: 255
- ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 292