లెక్క సరిచేస్తారా?
నేటి నుంచి ఇంగ్లండ్‌తో ఇండియా రెండో టెస్ట్
రతజ్ పటీదార్‌కు చాన్స్
అండర్సన్, బషీర్ ఆగయా
ఉ. 9.30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో లైవ్
విశాఖపట్నం: తొలి టెస్ట్‌లో గెలిచే స్థితి నుంచి ఊహించని ఓటమిని మూటగట్టుకున్న టీమిండియా.. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు రెడీ అయ్యింది. శుక్రవారం నుంచి జరిగే ఈ మ్యాచ్‌లో ఇంగ్లిష్ బజ్‌బాల్ స్ట్రాటజీకి గట్టి కౌంటర్ ఇవ్వాలని ప్లాన్స్ రెడీ చేస్తోంది. ఈ నేపథ్యంలో తొలి టెస్ట్‌లో ఫెయిలైన స్పిన్ స్ట్రాటజీనే మరోసారి అస్త్రంగా ప్రయోగించనుంది. మూడేళ్ల కిందట చెన్నైలో తొలి టెస్ట్‌లో ఓడిన ఇండియా ఆ తర్వాత అద్భుతంగా ఆడి ఏకంగా సిరీస్‌నే గెలిచింది. ఇప్పుడు కూడా అదే హిస్టరీని రిపీట్ చేయాలని భావిస్తోంది. అయితే అప్పటి టీమ్‌తో పోలిస్తే ఈసారి ఇంగ్లండ్ చాలా బలంగా ఉంది. తొలి టెస్ట్‌లో వాళ్లు పుంజుకున్న తీరే ఇందుకు నిదర్శనం. విశాఖ స్టేడియంలో ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు జరిగాయి. సాధారణంగా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటర్లకు అనుకూలం. కాబట్టి టాస్ గెలవడం కీలకం.
తుది కూర్పు ఎలా?
తొలి మ్యాచ్‌లో స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో ఇంగ్లండ్ గెలిచింది. దీన్ని కౌంటర్ అటాక్ చేయాలంటే బౌలింగ్‌ను మరింత బలోపేతం చేయాలి. స్టార్ స్పిన్నర్ జడేజా అందుబాటులో లేకపోయినా ఇండియా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల స్ట్రాటజీతోనే బరిలోకి దిగనుంది. ఆఫ్ స్పిన్నర్ రవి అశ్విన్‌కు తోడుగా అక్షర్ పటేల్, లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రావొచ్చు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్‌కు చాన్స్ ఇవ్వాలని భావిస్తున్నా.. పేసర్ మహ్మద్ సిరాజ్‌ను తప్పించడం అంత ఈజీ కాదు. మరో పేసర్‌గా బుమ్రా బాధ్యతలు పంచుకోనున్నాడు. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ టామ్ హార్ట్‌లీ టర్నింగ్‌కు కుదేలైన ఇండియా బ్యాటర్లు ప్రతీకారం తీర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది నెరవేరాలంటే కెప్టెన్ రోహిత్ ఎక్కువసేపు క్రీజులో ఉండాలి. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ లాంటి యంగ్‌స్టర్స్‌ను ఆడిస్తూ తను ముందుకెళ్లాలి. మూడో టెస్ట్‌కు విరాట్ వస్తున్నాడు కాబట్టి ఈ మ్యాచ్‌లో గిల్, అయ్యర్ కచ్చితంగా బ్యాట్లు ఝుళిపించాలి. కేఎల్ రాహుల్ ప్లేస్‌లో రజత్ పటీదార్‌కు చాన్స్ దక్కనుంది.
గెలుపే లక్ష్యంగా..
ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ కూడా పకడ్బందీగా తుది జట్టును ఎంపిక చేసింది. సిరీస్‌లో 2–0 లీడ్‌లో నిలిచి ఇండియాపై ఒత్తిడి పెంచాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో పేసర్ జేమ్స్ అండర్సన్‌తో పాటు యంగ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ డెబ్యూ చేయనున్నాడు. తొలి టెస్ట్‌లో ఫెయిలైన పేసర్ మార్క్ వుడ్, గాయంతో దూరమైన స్పిన్నర్ జాక్ లీచ్ ప్లేస్‌లో ఈ ఇద్దరికి చోటు కల్పించారు. బ్యాటింగ్‌లో ఒలీ పోప్‌పై మరోసారి భారీ అంచనాలు నెలకొన్నాయి. కెప్టెన్ బెన్ స్టోక్స్, డకెట్, క్రాలీ, బెయిర్‌స్టో బ్యాట్లకు పని చెప్పాల్సిన టైమ్ వచ్చేసింది. తొలి టెస్ట్‌లో మాస్టర్ క్లాస్ కెప్టెన్సీతో ఉన్న వనరులను చక్కగా ఉపయోగించుకున్న స్టోక్స్ అదే స్ట్రాటజీలను ఇక్కడా అమలు చేయాలని భావిస్తున్నాడు.