IND vs ENG: స్కూల్ క్రికెట్ అనుకున్నావా.. ఎందుకు DRS..?: కన్నెర్ర చేసిన గవాస్కర్

IND vs ENG: స్కూల్ క్రికెట్ అనుకున్నావా.. ఎందుకు DRS..?: కన్నెర్ర చేసిన గవాస్కర్

డెసిషన్ రివ్యూ సిస్టమ్(DRS).. ఏ ముహూర్తాన ఈ టెక్నాలజీని తీసుకొచ్చారో కానీ, ఓటైనప్పుడు DRS కోరటమే.. ఔట్ కానప్పుడు DRS కోరటమే. ఇదే మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లీష్ బ్యాటర్ టామ్ బాంటన్ సరదాకు అన్నట్లు డీఆర్ఎస్ కోరగా.. గవాస్కర్ ఆన్-ఎయిర్‌లో చీవాట్లు పెట్టారు.   

అసలేం జరిగిందంటే..?

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 356 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో మొదటి 20 ఓవర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లు ధీటుగా బదులిచ్చారు. 17 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోర్.. 123/2. సరిగ్గా అదే సమయంలో బాంటన్ వికెట్ పారేసుకున్నాడు. కుల్దీప్ వేసిన 18వ ఓవర్ ఆఖరి బంతికి  క్యాచ్ అవుట్ అయ్యాడు. బంతి ఎడ్జ్ తీసుకొని నేరుగా కీపర్ రాహుల్ చేతుల్లోకి వెళ్లింది. దాంతో, అంపైర్ అవుట్ ఇచ్చాడు. వెంటనే బాంటన్.. బంతి బ్యాట్ తగల్లేదన్నట్లుగా డీఆర్ఎస్ కోరాడు. రీప్లేలో బంతి ఎడ్జ్ తీసుకున్నట్లుగా స్నికోమీటర్‌లో చిన్న స్పైక్‌ వచ్చింది. దాంతో, బాంటన్ నిరాశతో పెవిలియన్ దారి పట్టాడు. ఇదే గవాస్కర్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది.

Also Read :- సఫారీ బ్యాటర్‌పై దూసుకెళ్లిన పాక్ బౌలర్

స్కూల్ మ్యాచ్ అనుకున్నావా..?

బాంటన్ రివ్యూను వేస్ట్ చేసినందుకు గవాస్కర్ అతన్ని విమర్శించారు. అవసరం ఉన్నా, లేకున్నా బ్యాటర్లు రివ్యూ తీసుకోవడం పనిగా పెట్టుకున్నారని అన్నారు.

"బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బంతి.. బ్యాట్ తగిలిందా, లేదా అనేది తెలియదా..! ఎందుకు రివ్యూ తీసుకుంటున్నారు. ఆమాత్రం తెలియకుండా బ్యాటర్ క్రీజులో ఎలా ఉండగలడు? ఇది అంతర్జాతీయ క్రికెట్. ఈ విషయం మీకు తెలియకపోవచ్చు.. స్కూల్ క్రికెట్ కాదు.." అని సునీల్ గవాస్కర్ ఆన్-ఎయిర్‌ వ్యాఖ్యానించారు.