తన తల్లికి అనారోగ్యంగా ఉండడంతో భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు నుంచి మధ్యలోనే వైదొలిగిన విషయం తెలిసిందే. బీసీసీఐ అనుమతితో హుటాహుటీన ఇంటికి బయలుదేరి వెళ్లాడు. దీంతో భారత జట్టు 10 మంది ఆటగాళ్లతోనే మూడో రోజు ఆటను కొనసాగించింది. సబ్‌స్టిట్యూట్ రూపంలో దేవదూత్ పడిక్కల్‌ను జట్టులోకి తీసుకున్నప్పటికీ.. అతను ఫీల్డింగ్‌కు మాత్రమే అనుమతి ఇవ్వడంతో నలుగురు బౌలర్లతోనే నెట్టుకొచ్చింది. మూడో రోజు 112 పరుగులకే 8 వికెట్లు పడగొట్టి 126 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది.
ఇప్పుడు అశ్విన్ తల్లి ఆరోగ్యం కుదుటపడడంతో అతడు తిరిగి జట్టులో చేరనున్నాడు. నాలుగో రోజు ఆట లంచ్ విరామం అనంతరం అతడు మైదానంలోకి దిగనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన చేసింది. మూడో టెస్టు నాలుగో రోజు ఆఫ్‌స్పిన్నర్ ఆర్ అశ్విన్ తిరిగి భారత జట్టులో చేరనున్నాడని బీసీసీఐ ధృవీకరించింది.
"కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా కొన్ని గంటల విరామం అనంతరం ఆర్ అశ్విన్ తిరిగి జట్టులోకి వచ్చినట్లు ప్రకటించడం ఆనందంగా ఉంది. ఈ కష్ట సమయంలో అతని కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని జట్టు యాజమాన్యం, సహచరులు, అభిమానులు అందరూ అండగా నిలిచారు. సమష్టి మద్దతిని ఇచ్చారు. అతనికి మేనేజ్‌మెంట్ మైదానంలోకి పునః స్వాగతం పలుకుతోంది.." అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
Ravichandran Ashwin
ఇంగ్లాండ్ ఎదుట భారీ లక్ష్యం
నాలుగో రోజు ఆటలో లంచ్ విరామ సమయానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది. ప్రస్తుతానికి 440 పరుగుల ఆధిక్యంలో ఉంది. యశస్వి జైశ్వాల్(149; 189 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్ లు), సర్ఫరాజ్ ఖాన్(22; 23 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్) క్రీజులో ఉన్నారు.