IND vs ENG: యువరాజు కాదు.. డక్స్ రారాజు.. భారత క్రికెటర్‌పై నెట్టింట ట్రోల్స్

టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ నెట్టింట ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. గిల్ భారత క్రికెట్ ఆశాదీపం, అతనే భవిష్యత్ అంటూ కొనియాడిన నోర్లే అతనిపై విమర్శలు చేస్తున్నాయి. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో తొమ్మిది బంతులు ఎదుర్కొన్న గిల్(0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. అనవరసపు షాట్‌కు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. దీంతో అతన్ని విమర్శిస్తూ నెటిజెన్స్.. నెట్టింట మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. 

23, 0, 34, 104, 0.. గత ఐదు టెస్ట్ ఇన్నింగ్స్‌లలో శుభ్‌మాన్ గిల్ స్కోర్లివి. ఒక సెంచరీ మినహా అతని బ్యాటింగ్‌లో నిలకడలేదు. వచ్చావా.. ఔటయ్యామా.. డగౌట్‌కి వెళ్ళామా అన్నట్లు ఆడుతున్నాడు. గతేడాది అద్భుత ఫామ్ కనపరచడంతో జట్టు నుంచి తప్పించే పరిస్థితులు లేవు. ఈ క్రమంలో అతన్ని ఆట పట్టిస్తూ నెటిజెన్స్ భిన్న రకాల మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. "గిల్ యువరాజు కాదు.. డకౌట్ల రారాజు" అని ఒక యూజర్ కామెంట్ చేయగా.. "ఒక సెంచరీ.. పది మ్యాచ్‌లు.. గిల్ వ్యూహమిదే" అని మరొక యూజర్ కామెంట్ చేశాడు.

మార్క్ వుడ్ విజృంభణ

మూడో టెస్టు ప్రారంభమైన కొద్దిసేపటికే భార‌త జట్టు క‌ష్టాల్లో ప‌డింది. ఇంగ్లండ్ పేస‌ర్ మార్క్ వుడ్ విజృంభించ‌డంతో ఆట మొదలైన కాసేప‌టికే మూడు కీల‌క వికెట్లు కోల్పోయింది. పిచ్ బౌన్స్‌కు అనుకూలించ‌డంతో వుడ్ నిప్పులు చెరిగాడు. పదునైన పేస్ తో ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్(10), శుభ్‌మ‌న్ గిల్(0) బుట్ట‌లో వేసుకున్నాడు. ఆపై కొద్దిసేపటికే రజత్ పటీదార్(5) ను టామ్ హ‌ర్ట్లే పెవిలియన్ చేర్చాడు. ఆ సమయంలో రోహిత్ శర్మ(91 నాటౌట్), రవీంద్ర జడేజా(59 నాటౌట్) ఆదుకున్నారు. ప్ర‌స్తుతం టీమిండియా 48 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 170 ప‌రుగులు చేసింది.