- టార్గెట్ 192, ప్రస్తుతం 40/0
- రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 145 ఆలౌట్
- అశ్విన్‌కు 5, కుల్దీప్‌కు 4 వికెట్లు
- 90 రన్స్‌తో ఆదుకున్న జురెల్
రాంచీ: బ్యాటింగ్‌లో కొత్త కుర్రాడు ధ్రువ్ జురెల్ (149 బాల్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 90) అద్భుత పోరాటం.. బౌలింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్ (5/51), కుల్దీప్ యాదవ్ (4/22) మ్యాజిక్‌తో నాలుగో టెస్ట్ ఇండియా చేతుల్లోకి వచ్చేసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 192 రన్స్ టార్గెట్‌ను ఛేదించేందుకు ఆదివారం మూడో రోజు బరిలోకి దిగిన టీమిండియా ఆట ముగిసే టైమ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో 8 ఓవర్లలో 40/1 స్కోరు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (24 బ్యాటింగ్), యశస్వి జైస్వాల్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇండియాకు మరో152 రన్స్ అవసరం. చేతిలో10 వికెట్లతో పాటు రెండు రోజుల ఆట మిగిలి ఉంది. అంతకుముందు 219/7 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 103.2 ఓవర్లలో 307 రన్స్‌కు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 211 నిమిషాల పాటు ఓపికగా బ్యాటింగ్ చేసిన జురెల్ ఇంగ్లిష్ బౌలర్ల దాడి నుంచి హోమ్ టీమ్‌ను సురక్షితంగా కాపాడాడు. కుల్దీప్ యాదవ్ (28)తో 8వ వికెట్‌కు 76, ఆకాశ్ దీప్ (9)తో 9వ వికెట్‌కు 40, సిరాజ్ (0 నాటౌట్)తో పదో వికెట్‌కు14 రన్స్ జోడించి టీమ్ స్కోరు 300 మార్కు దాటించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 5, టామ్ హార్ట్‌లీ 3 వికెట్లు తీశారు.
ఇంగ్లండ్‌ను తిప్పేసిన స్పిన్నర్లు
46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 53.5 ఓవర్లలో 145 రన్స్‌కే కుప్పకూలింది. జాక్ క్రాలీ (60) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రెండో సెషన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లిష్ లైనప్‌ను అశ్విన్, కుల్దీప్ పేకమేడలా కూల్చారు. ఐదో ఓవర్లో వరుస బాల్స్‌లో బెన్ డకెట్ (15), ఒలీ పోప్ (0)ను ఔట్ చేసి అశ్విన్ వికెట్ల పతనాన్ని మొదలుపెట్టాడు. క్రాలీతో కలిసి ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేసిన రూట్(11) కూడా అశ్విన్ స్పిన్‌ను ఎదుర్కోలేకపోయాడు. మూడోవికెట్‌కు 46 రన్స్ జత చేసి వెనుదిరిగాడు. ఈ దశలో బెయిర్‌స్టో (30) కాసేపు బ్యాట్ అడ్డేశాడు.
అయితే కాస్త లేటుగా ఎంట్రీ ఇచ్చిన కుల్దీప్..
వచ్చి రావడంతోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన క్రాలీని ఔట్ చేసి ఇంగ్లండ్‌కు ఝలక్ ఇచ్చాడు. దీంతో బెయిర్‌స్టోతో నాలుగో వికెట్‌కు 45 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. ఓసారి అంపైర్ కాల్‌తో గట్టెక్కిన కెప్టెన్ బెన్ స్టోక్స్(4) కూడా ఎక్కువసేపు వికెట్‌ను కాపాడుకోలేదు. ఇన్నింగ్స్ 33వ ఓవర్‌లో కుల్దీప్ లో టర్నింగ్ బాల్‌తో స్టోక్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. బెన్ ఫోక్స్ (17) జాగ్రత్తగా ఆడినా.. టీ తర్వాత ఫస్ట్ బాల్‌కే జడేజా.. బెయిర్‌స్టోను ఔట్ చేయడంతో ఇంగ్లండ్ 120/6తో కష్టాల్లో పడింది. కొద్దిసేపటికే కుల్దీప్ నాలుగు బాల్స్ తేడాలో టామ్ హార్ట్‌లీ (7), ఒలీ రాబిన్సన్ (0)ను పెవిలియన్‌కు పంపాడు. చివర్లో అశ్విన్ మూడు బాల్స్ వ్యవధిలో ఫోక్స్, అండర్సన్ (0) వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా 35 రన్స్‌కే చివరి ఏడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్.. రోహిత్ సేనకు చిన్న టార్గెట్‌ను ఇచ్చింది.
స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అశ్విన్ (354) రికార్డు సృష్టించాడు. అనిల్ కుంబ్లే (350 వికెట్లు )ను అధిగమించాడు. అశ్విన్ 59 టెస్టుల్ల్లోనే ఈ ఘనత అందుకోగా, కుంబ్లేకు 63 మ్యాచ్‌లు అవసరమయ్యాయి.
ఇండియా తరఫున టెస్టుల్లో 4 వేల రన్స్ పూర్తి చేసిన 17వ ప్లేయర్ రోహిత్ శర్మ.
టెస్ట్‌ల్లో అశ్విన్ ఐదు వికెట్లు తీయడం ఇది 35వసారి (99 మ్యాచ్‌లు). కుంబ్లే 132 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. మురళీధరన్ 133 టెస్ట్‌ల్లో అత్యధికంగా 67 సార్లు ఐదు వికెట్లు పడగొట్టి టాప్‌లో నిలవగా, వార్న్ (145 టెస్ట్‌ల్లో 37సార్లు), రిచర్డ్ హ్యాడ్లీ (86 మ్యాచ్‌ల్లో 36సార్లు) తర్వాతి ప్లేస్‌ల్లోఉన్నారు.
ఇండియాలో 16 టెస్టు వేదికల్లో ఆడిన అశ్విన్ 12 మైదానాల్లో ఐదు వికెట్ హాల్ సాధించాడు.
సంక్షిప్త స్కోర్లు:
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 353 ఆలౌట్. ఇండియా తొలి ఇన్నింగ్స్: 307 ఆలౌట్ (ధ్రువ్ జురెల్ 90, కుల్దీప్ యాదవ్ 28, బషీర్ 5/119, టామ్ హార్ట్‌లీ 3/68).
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 53.5 ఓవర్లలో 145 ఆలౌట్
(జాక్ క్రాలీ 60, బెయిర్‌స్టో 30, అశ్విన్ 5/51, కుల్దీప్ 4/22). ఇండియా రెండో ఇన్నింగ్స్: 8 ఓవర్లలో 40/0 (రోహిత్ 24 బ్యాటింగ్, యశస్వి 16 బ్యాటింగ్)